రోడ్ల మీద నన్ను ఫాలో అవుతున్నారు!
కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘అగధ’. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయారాణిరెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో చెప్పిన విశేషాలివీ.. “నేనెప్పుడూ జయాపజయాల గురించి పట్టించుకోను.
రాజుతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుందని ‘అగధ’ మూవీకి ఓకే చెప్పా. ఇందులోని చీరకట్టులో నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి మహాదేవి పాత్ర కోసం మారడానికి టైమ్ పట్టింది. దేవుడి అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. బుద్ధిజం పుస్తకాల్ని చదివా. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నా. ప్రతీ ముద్ర గురించి, ఆ పాత్ర నడవడిక గురించి అర్థం చేసుకుని నటించా. సినిమాలో ఎక్కడా కూడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్తలు తీసుకున్నా.
శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం అనేది నన్ను మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుంది. మేల్ చేసినప్పుడు మేల్ సెంట్రిక్ సినిమాలు అనరు. కానీ ఫీమేల్ చేస్తే మాత్రం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటారు. ఇంట్లో మహిళలు మల్టీపుల్ టాస్కులు చేస్తుంటారు. స్క్రీన్ మీద ఫీమేల్ కారెక్టర్స్ ఇండిపెండెంట్‌గా ఎందుకు ఉండకూడదని అనుకునేదాన్ని. 2019 నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. చిన్న చిన్న పాత్రల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా.
సినిమాల కోసం ఎంతో కష్టపడ్డా. ఇప్పటికీ నాకు కారు లేదు. బైక్ మీదే వస్తా. ఇప్పుడు అందరూ రోడ్ల మీద గుర్తు పట్టి నన్ను ఫాలో అవుతున్నారు (నవ్వుతూ). ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చే వెహికల్ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది. మాది మిడిల్ క్లాస్ కావడంతో మాకు కారు పెద్ద విషయం (నవ్వుతూ).సత్యం రాజేశ్ పక్కన చేసిందా? అయితే వద్దు అని నా ముందే చాలా మంది అన్నారు. ఎవరి పక్కన చేస్తున్నామో కూడా ఇక్కడ చూస్తున్నారు. అది చాలా తప్పు. నేను చిన్న, పెద్ద అవకాశం అని నేను చూడను.
నచ్చిన పాత్రనే ఎంచుకుంటా. పైగా మన ఇంట్లోని మహిళలను రిప్రజెంట్ చేసే కారెక్టర్స్‌ను పోషించాలని అనుకుంటున్నా. ఓ తెలుగమ్మాయిగా.. మన తెలుగు అమ్మాయిలా పాత్రల్ని తెరపై నేను రిప్రజెంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అందుకే నాకు గ్లామర్, క్వీన్ వంటి పాత్రల కన్నా.. సాధారణ మహిళా పాత్రలే ఇష్టం. నెక్స్ నేను ఓ లవ్‌స్టోరీకి సైన్ చేశా. ‘పొలిమేర’, ‘అగధ’ వంటి చిత్రాలకే సూట్ అవుతాను అని అనుకునే విషయాన్ని నేను బ్రేక్ చేస్తా” అని తెలిపింది.






