4 July, 2026 | 8:16 PM

దర్జాగా దోచేస్తున్నారు!

19-10-2024 12:32 AM
  1. జోరుగా ఇసుక అక్రమ రవాణా
  2. చోద్యం చూస్తున్న అధికారులు

మణుగూరు, అక్టోబర్ 18: పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక మాఫీయా దర్జాగా సహజ వనరులను దోచేస్తున్నారు. కండ్లముందే ఇసుక తరలిపోతున్నా పట్టించుకోవాల్సిన మైనింగ్, పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని బూర్గంపాడు మండలంలో ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని గోదావరి నది, కిన్నెరసాని వాగు పరిసరాల్లో ఇసుకాసురులు విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు. రోజుకు టన్నుల కొద్ది ఇసుకను అక్రమంగా తరలిస్తూ కాసులు దండుకొంటున్నారు.

సారపాక, తాళగొమ్మూరు, రెడ్డిపాలెం, సోంపల్లి, బుడ్డగూడెం, పినపాక పట్టి నగర్, ఉప్పుసాక గ్రామాల్లో ట్రాక్టర్ యజమానులు దందా జోరుగా సాగిస్తున్నారు. ఇసుక రీచ్‌లు లేకపోవడంతో గ్రామాల్లో వినియోగదారుల అవసరాన్నే అవకాశంగా మలచుకొని అక్రమార్కులు వాగులను తోడేస్తున్నారు. 

ట్రాక్టర్ ఇసుక రూ.4వేలు

గ్రామానికి తలాపున ఉన్న వాగుల నుంచి ఇసుక తీసుకొస్తూ అక్రమార్కులు ట్రాక్టర్‌కు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. అక్రమంగా గోదావరి, కిన్నెరసానిలోంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారికి అధికారుల అండాదండలు మెండుగా ఉన్నాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

వాగుల్లో అడ్డగోలుగా ఇసుక తవ్వుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.