27 May, 2026 | 2:06 AM

పచ్చని చెట్లకు నిప్పు..

27-05-2026 01:15 AM

కనుమరుగవుతున్న వృక్షాలు

నిలువ నీడ లేకుండా చేస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు

తాడ్వాయి మే, 26 (విజయక్రాంతి): పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు.. అన్నారు పెద్దలు. కానీ ఆ పచ్చని చెట్లే లేకుండా చేస్తున్నారు ఈనాటి కొందరు దుండగులు. అశోకుడు చెట్లు నాటించెను, అశోకుడు రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచెను అని పుస్తకాల్లో చదువుకున్నాం.

ఆనాడు రోడ్డుకిరువైపులా పచ్చని మొక్కలు నాటితే అవి నేడు వృక్షాలుగా మారి దారిన పోయే బాటసారులకు నీడను అందిస్తున్నాయి. నీడ కోసమే రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారు.అవి పెరిగి పెద్దవై మహావృక్షాలుగా మారాయి. కానీ ప్రస్తుతం ఆ వృక్షాలే లేకుండా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వృక్షాలకు నిప్పు పెడుతూ వాటిని కూకటి వేళ్లతో పెకిలించేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ శివారు నుంచి ఎల్లారెడ్డి శివారు వరకు ఉన్న మర్రి వృక్షాలకు  కొందరు తమ స్వప్రయోజనాలకు వృక్షాలకు నిప్పు పెట్టి కాల్చి వేస్తున్నారు.కాల్చి వేసిన అనంతరం వృక్షాల నుంచి వచ్చిన కలపను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెద్ద పెద్ద మర్రి వృక్షాలు ఉండేవి. కానీ కొందరు చేస్తున్న కార్యక్రమాల వల్ల వృక్షాలే లేకుండా పోతున్నాయి.

పట్టించుకోని ఆర్‌అండ్‌బి అధికారులు.

- రోడ్డుకు ఇరువైపులా ఉన్న మర్రి వృక్షాలను కాపాడడంలో ఆర్ అండ్ బి అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.. అందరూ చూస్తుండగానే కొందరు వ్యక్తులు వృక్షాలకు నిప్పు పెట్టి కాలబెడుతున్న పట్టించుకోవడం లేదు. కావాలనే కొందరు రాత్రిపూట మర్రి వృక్షాల మొదట్లో చెత్త వేసి నిప్పుంటిస్తున్నారు. అది మెల్లగా ఖాళీ మహా వృక్షాన్ని కాల్చేస్తుంది. అనంతరం చెట్టు కింద పడ్డాక ఆ కట్టెలను పోగు చేసి బయట విక్రయించుకుంటున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఇక్కడ మాకు వృక్షాలు ఇబ్బందిగా ఉన్నాయని బదులు చెబుతున్నారు. నిరోధించాల్సిన ఆర్ అండ్ బి అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడంతోనే వృక్షాలు మాయమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు..

- కొందరు కావాలనే వృక్షాలకు నిప్పు పెట్టి అక్రమంగా తరలిస్తున్న అటవీక శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో కలపను అక్రమంగా రవాణా చేస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా పోయాయి. సదరు అటవీశాఖ అధికారులు అదే ప్రాంతంలో సంచరిస్తున్న ఏమాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వృక్షాలకు నిప్పు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరైతే నిప్పు పెడతారో అలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

నిలువ నీడ లేకుండా పోతుంది..

- రోడ్డుకు ఇరువైపులు ఉన్న మర్రి వృక్షాలకు నిప్పు పెట్టడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు  నిలువ నీడ లేకుండా పోతుంది. వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లే వాహనదారులు, కాలినడకన వెళ్లే బాటసారిలు వృక్షాల కింద నిలబడి సేద తీరుతారు.క్రమక్రమంగా వృక్షాలను కాల్చివేస్తుండడం తో వృక్షాలే కనుమరుగై పోయే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.

ఆనాడు ఎంతో కష్టపడి నాటిన వృక్షాలను నేడు కాపాడాల్సింది పోయి వాటినే కాలబెడుతున్నారని  ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల ఉన్న వృక్షాలను కాపాడాలని కోరుతున్నారు ఎర్ర పహాడ్ శివారు నుంచి ఎల్లారెడ్డి వరకు రోడ్డుకు ఇరువైపులా మర్రి వృక్షాలు ఉన్నాయి. వీటిని కావాలనే కొందరు వ్యక్తులు నిప్పు పెట్టి వృక్షాలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.