అక్రమాలు ప్రశ్నిస్తే కక్షగట్టారు
ప్రాణ హాని ఉంది రక్షణ కల్పించండి
మంగపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని ఓ ప్రముఖ వ్యక్తి అక్రమాలకు పాల్పడగా ఆ అక్రమాలను తాను ప్రశ్నించినందుకు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కమలాపురంకు చెందిన సిద్దాబత్తుల జగదీశ్వర రావు ఆరోపించారు.
మండలంలోని కమలాపురంలో బుధవారం విలేకరుల సమావేశంలో సిద్దాబత్తుల జగదీశ్వర రావు మాట్లాడుతూ కమలాపురంకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి, అతని భార్యకు భూమి లేకున్నా ఆ వ్యక్తి పేరుపై, అతని భార్య పేరుపై మంగపేట మండలంలోని చెరుపల్లి రెవెన్యూ గ్రామ పరధిలో సుమారు 14 ఎకరాలు, కమలాపురంలో రెవెన్యూ గ్రామ పరధిలో సుమారు 5 ఎకరాలు భూమి ఉన్నట్లు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉన్నారని అన్నారు. ఆ పట్టాదారు పాసు పుస్తకాలతో సదరు వ్యక్తి, అతని భార్య రైతు బంధు, వ్యవసాయ రుణ మాఫీ పొందుతున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై మంగపేట తహసీల్ కార్యాలయంలో తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో సదరు వ్యక్తికి, అతని భార్యకు తాము నోటీసులు పంపగా ఆ ఇద్దరు తగిన ఆధారాలు చూపించడం లేదని మంగపేట తహసీల్దార్ తనకు ఒక లెటర్ ఇచ్చారని సిద్దాబత్తుల జగదీశ్వర రావు తెలిపారు. ఆ లెటర్ ను తాను ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అందజేశానని సిద్దాబత్తుల జగదీశ్వర రావు తెలిపారు.
దీంతో సదరు వ్యక్తి, అతని స్నేహితుడు కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని సిద్దాబత్తుల జగదీశ్వర రావు ఆరోపించారు. సదరు వ్యక్తి, అతని స్నేహితుడి వలన తనకు ప్రాణ హాని ఉందని మంగపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేసినట్లు సిద్దాబత్తుల జగదీశ్వర రావు తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి భూమి లేకున్నా రైతు బంధు , రుణ మాఫీ పొందిన సదరు వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అక్రమంగా పొందిన రైతు బంధు, రుణ మాఫీ డబ్బులను రికవరీ చేయాలని, తనకు ప్రాణ హాని ఉందని కావున తనకు రక్షణ కల్పించాలని సిద్దాబత్తుల జగదీశ్వర రావు కోరారు.






