అప్పుల కుప్ప ఇచ్చారు!
తొలి ఏడాదే 1.27లక్షల కోట్ల అప్పు
- కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో ఆరు లక్షల కోట్లు దాటుతుంది
- పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం ౪.౧౭ లక్షల కోట్ల అప్పే
- అసెంబ్లీలో మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ ౧౭ (విజయక్రాంతి): అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ అప్పుల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,27,208 కోట్లు అప్పు తీసుకుందని ఆరోపించారు. ఈ సర్కారు ఎఫ్‌ఆర్‌బీఎం కింద చేసిన అప్పు రూ.51,277 కోట్లేనని వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులన్నీ కలిపితే రూ.1,27,208 కోట్లు అవుతుందని అన్నారు. అంటే ఐదేండ్లలో కాంగ్రెస్ ప్రభు త్వం చేసే అప్పులు రూ.6,36,400 కోట్లు ఉండబోతోందని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో తాము చేసిన మొత్తం అప్పు రూ.4,17,496 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. దీనిపై శాసన సభలో ప్రత్యేక చర్చ పెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పు శ్వేత పత్రం లో రూ.6,71,757 కోట్లు అన్నారని, బహిరంగ సభల్లో సీఎం రూ.7 లక్షల కోట్లు అం టున్నారని గుర్తుచేశారు.
నోటికొచ్చినట్టు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో పెట్టకుండా రెండు బిల్లులను సభలో పెట్టారని మాత్రమే తాము అన్నామని చెప్పారు. పదేళ్లలో తమ సర్కారు రూ. 4.17 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసిందని.. అయితే రూ.7 లక్షల కోట్లంటూ సభను తప్పుదారి పట్టించినందుకే భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని స్పష్టంచేశారు. వ్యవసాయ కూలీల అంశంపై కాదని చెప్పా రు.
దేని మీద ఇచ్చామో స్పీకర్ స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తాము పూర్తిగా విద్యుత్ బిల్లులు చెల్లించినా డిఫ్యూటీ సీఎం భట్టి రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వడ్డీలుగా కట్టింది రూ.2900 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక తెలిపిందని.. కానీ, సర్కారు అబద్ధాలు చెప్తోందని దుయ్యబట్టారు. తాము పూర్తిగా ప్రిపేరై వచ్చామని, ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధమని హరీశ్ సవాల్ విసిరారు.
మీ అప్పులకు కట్టే వడ్డీలే 66 వేల కోట్లు
- ఏడాదిలో లక్ష కోట్ల అప్పులు చేయలేదు
- నాడు గ్యారెంటీ లేకుండానే మిల్లర్లకు ధాన్యం అప్పగింత
- 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్: డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): శాసనసభలో అధికార, ప్రతిపక్షాల నడుమ మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ర్ట అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం సాగింది. సభలో ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల వివరాలను వెల్లడిస్తూ.. భట్టి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో లక్ష కోట్లు అప్పు చేసిందనడం కరెక్టు కాదని.. తాము రూ.52 వేల కోట్లు మాత్రమే రుణం తీసుకున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే తాము అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్లు చేసిన అప్పులకు మిత్తీల కిందే రూ.66 వేల కోట్లను కట్టామని స్పష్టంచేశారు.
గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులే రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయిందని, తాము ఇప్పటివరకు రూ. 14 వేల కోట్లను క్లియర్ చేశామని వెల్లడించారు. సివిల్ సప్లు బకాయిలు కూడా రూ.14 వేల కోట్లున్నాయని చెప్పారురు. గత ప్రభుత్వం గురుకులాల బిల్లులను సైతం పెండింగ్‌లోనే పెట్టిందని, ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే పరిస్థితే లేకుండా పోయిందని అన్నారు.
బీఆర్‌ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు
బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తు న్నారని చురకలంటించారు. తమ ప్రభుత్వం తెస్తున్న అప్పుల్లో సగం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయని విరుచుకుపడ్డారు.
పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ చేసిన విధ్వంసాన్ని ఒకేసారి సరిచేయడం వీలుకాదని.. గత ప్రభుత్వం హయాంలో అస్తవ్యస్తమైన రాష్ర్ట ఆర్థిక స్థితిని తిరిగి గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మాదిరి కాకుండా రాష్ర్ట ప్రయోజనాలను, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నామని ఉద్ఘాటించారు.
తాము తీసుకున్న ప్రతి రూపాయి అప్పునకు సరైన ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఓఆర్‌ఆర్‌ను బీఆర్‌ఎస్ సర్కారు 30 ఏళ్లకు అమ్ముకుందని ధ్వజమెత్తారు. వారిలా మేమూ అంబానీ, అదానీలకు అమ్ముకుంటే రాబోయే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాధిస్తాయన్నారు.
ప్రజల కోసం పనిచేస్తే ప్రివిలేజ్ మోషన్?
బీఆర్‌ఎస్ నేతలు భూస్వామ్య మనస్తత్వంతో తనపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని భట్టి అన్నారు. సభలో వ్యవహారాలేమీ తాను బయట మాట్లాడలేదని.. ఓ జర్నలిస్టు ప్రశ్నకు సమాధానంగా కూలీలకు రూ.12 వేల సాయంపై తెలిపానని చెప్పారు. పేదలకు సాయం అందొద్దని బీఆర్‌ఎస్ నేతలు కోరుకుంటున్నారా? ప్రజల కోసం పనిచేస్తే ప్రివిలేజ్ మోహన్ ఇస్తారా? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ నేతలు సభను తమకు అనుకూలంగా నడిపేందుకు రూల్స్ బుక్‌ను సైతం మార్చేశారని ఆరోపించారు. ప్లకార్డులు తీసుకురాకూడదని, నినాదాలు చేయ వద్దని మార్పుచేసినట్టు తెలిపారు. ఇప్పుడు వాళ్లే ఆ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీఏసీలో అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను తెలిపితే చివరకు స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునేవారని..
అలా కాకుండా బీఏసీలో కాగి తాలు పారేసి పోతున్నారని, హరీశ్‌రావుకు నిజం చెప్పే అలవాటు లేదని, ఆయన ప్రతి దీ రాజకీయం చేస్తారని విమర్శించారు. తాను అప్పుల లెక్కలన్నీ కరెక్టుగానే చెప్పానని స్పష్టం చేశారు. అధికారం పోయాక బీ ఆర్‌ఎస్ నేతలకు మతిపోయిందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు తప్పుదోవ సభను పట్టిస్తున్నారని మండిపడ్డారు.






