22 April, 2026 | 1:35 AM

గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ తెలంగాణ

18-12-2024 02:22 AM
  1. పర్యాటకాభివృద్ధి కోసమే టూరిజం పాలసీ
  2. పీపీపీ పద్ధతిలో పెట్టుబడులు ఆహ్వానిస్తాం..
  3. పర్యాటక రంగం గత ప్రభుత్వం శీతకన్ను 
  4. పర్యాటక పాలసీపై స్వల్పకాలిక చర్చలో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. అసెంబ్లీలో మంగళవారం పర్యాటక పాలసీపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి ప్రసంగించారు.

పర్యాటక రంగమంటే కేవలం ఆదాయ వనరుగా ప్రభుత్వం భావించడం లేదని, ఆ రంగాన్ని తెలంగాణ వారసత్వంగా భావిస్తున్నదని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా పుట్టుకొస్తున్న కొలువుల్లో 10 శాతం టూరిజానికి సంబంధించినవేని వెల్లడించారు. థాయ్‌లాండ్, మాల్దీవ్స్, భూటాన్, కరేబియన్ ఐలాండ్స్, గ్రీస్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పర్యాటక రంగంపైనే ఆధారపడి నడుస్తోందన్నారు.

2023-24 సంవత్సరంలో రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగ భాగస్వామ్యం 5 శాతంగా ఉందన్నారు. దేశీయ రాకపోకల విషయంలో రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉందని, అలాగే అంతర్జాతీయ రాకపోకల విషయంలో 12వ స్థానంలో ఉందని వివరించారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, ఐటీ, పాలిటిక్స్ వంటి రంగాల్లో ఒత్తిడికి గురవుతున్న వారు కుటుంబంతో కలిసి ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి సేద తీరాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. కొన్నేండ్లుగా పర్యాటక రంగంలో నమోదవుతున్న వృద్ధే అందుకు నిదర్శమని స్పష్టం చేశారు. 

తెలంగాణ పర్యాటకంపై నిర్లక్ష్యం..

గోల్కొండ కోట, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులు, మెదక్ చర్చి, మక్కా మసీదు, జైన బౌద్ధ ఆరామాలు వంటి అనేక చారిత్రక కట్టడాలు, సహజ కట్టడాలు తెలంగాణ వారసత్వ సంపద అని కొనియాడారు. ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం, వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.

గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పదేళ్లలో కొత్త టూరిజం పాలసీ అనేదే లేకుండాపోయిందని వాపోయారు. పర్యాటక రంగాన్ని ఆదాయ మార్గంగా మార్చుకోవాలనే లక్ష్యంతో సర్కార్ చారిత్రక, ఆధ్యాత్మిక, పురావస్తు, ఎకో, హెల్త్ తదితర రంగాలపైనా దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేసిందన్నారు.

పెట్టుబడుల పెంపునకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పెట్టుబడులు ఆహ్వానిస్తామన్నారు. పర్యాటక శాఖకు విలువైన స్థలాలు, ఆస్తులున్నప్పటికీ ఆదాయం మాత్రం అంతంతమాత్రంగా ఉందన్నారు. హరిత హోటల్స్ నుంచి కూడా ఆశించిన మేర లాభాలు రావడం లేదన్నారు. వాటిని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని తెలిపారు.

మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెరగనుందని, తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. పోచంపల్లి చీరెలు, చేర్యాల, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ కొయ్యబొమ్మలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. వాటికి సంబంధించిన ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

టూరిజం ప్రమోషన్‌లో భాగంగా స్టడీ టూర్ నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యాటకరంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక పాలసీపై స్వల్పకాలిక చర్చ అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

పర్యాటకశాఖ పనులు.. విజయాలు..

* పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.99.46 కోట్ల పరిపాలనా అనుమతులు

* స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకంలో భాగంగా రామప్ప సర్క్యూట్, నల్లమల సర్క్యూట్‌కు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.141.48 కోట్ల దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం 

* శ్రీశైలం, సోమశిల, నాగార్జునసాగర్ వరకు ఉన్న 160 కి.మీ మేర పర్యాటక రంగ అభివృద్ధి

* రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించేందుకు వీలుగా ‘తెలంగాణ దర్శిని’ డ్రైవ్. అందుకు రూ.12 కోట్ల నిధులు.

* సోమశిల, నిర్మల్ గ్రామాలకు జాతీయస్థాయి పర్యాటక అవార్డులు. ఉత్తమ స్పిరిచ్యువల్ పర్యాటక వెల్‌నెస్ క్యాటగిరీలో సోమశిల, క్రాఫ్ట్స్ క్యాటగిరీలో నిర్మల్‌కు అవార్డులు

పరిశోధనాత్మక పర్యాటక రంగం..

  1. మిషన్ మోడ్‌లో అభివృద్ధికి రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది పర్యాటక ప్రాంతాల గుర్తింపు
  2. పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రాథమిక మౌలిక వసతుల కల్పన
  3. పెట్టుబడిదారులకు గణనీయమైన రాయితీలు, ప్రోత్సాహకాలు
  4. ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్
  5. పెట్టుబడుల్లో సబ్సిడీ
  6. పారిశ్రామిక విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు 
  7. ఆస్తి పన్ను సదుపాయాల్లో రాయితీలు
  8. భూ మార్పిడి ఛార్జీలు, భూరిజిస్ట్రేషన్ ఛార్జీల రీయింబర్స్‌మెంట్
  9. తెలంగాణ బ్రాండింగ్, మార్కెటింగ్ పెంపు
  10. పర్యాటక ప్రదర్శనలు, పండుగల నిర్వహణ
  11. పర్యాటక, హోటల్ రంగ అవసరాలకు అనుగుణంగా మానవ వనరులకు శిక్షణ
  12. ఏటా పర్యాటక పురస్కారాల ప్రదానం
  13. స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్, సింగిల్ విండో పోర్టల్ నిర్వహణ
  14. సీఎం అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రమోషన్ బోర్డు, గమ్యస్థానాల నిర్వహణ సంస్థల ఏర్పాటు

ప్రతిపాదిత పర్యాటక ముసాయిదాలోని ప్రధాన అంశాలు..

  1. రానున్న ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
  2. 3 లక్షల అదనపు ఉద్యోగ, ఉపాధి అవకాశాల సృష్టి
  3. టూరిజంలో తెలంగాణను టాప్-5లో నిలపడం.
  4. రాష్ట్ర జీడీపీకి పర్యాటక రంగం ద్వారా 10 శాతం వరకు తోడ్పాటు అందించడం.