ప్రజా సమస్యలను గాలికొదిలేశారు
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): బోరబండ డివిజన్ సైట్-3 పరిధిలోని వీకర్ సెక్షన్ బస్తీలలో సీపీఎం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం ఏడవ రోజున ఉత్సాహంగా సాగింది. నగర కార్యదర్శి ఎం. వెంకటేష్, నాయకులు కే.ఎన్. రాజన్న, ఎం. శ్రీనివాసరావు, టి. సాయి శేషగిరిరావుల నేతృత్వంలో శనివారం ఇంటింటికీ తిరిగి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సంతోష్ నగర్, జ్యోతి నగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం స్పష్టం గా కనిపిస్తోందని విమర్శించారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపుపై స్పష్టత లేదని, గ్యాస్ సబ్సిడీ సొమ్ము మహిళల ఖాతాల్లో జమకావడం లేదని, నెలకు రూ. 2500 ఆర్థిక సాయం హామీ అటకెక్కిందని ప్రజలు వాపోతున్నట్లు వారు పేర్కొన్నారు. బస్తీలలో మౌలిక సదుపాయాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని పర్యటనలో తేలిందన్నారు.
అనేక బస్తీలలో మంచినీరు కేవలం 45 నిమిషాలు మాత్రమే సరఫరా అవుతోందని, వీధి దీపాలు వెలగడం లేదని స్థానికు లు నాయకుల దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, సిబ్బంది బాగు చేసిన మరుసటి రోజే మళ్లీ మురుగు పొంగిపొర్లుతోందని, జిహెచ్‌ఎంసి అధికారులు రోడ్లపై పేరుకుపోయిన చెత్తను, బిల్డింగ్ వ్యర్థాలను తొలగించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరు, పెండింగ్లో ఉన్న పింఛన్ల కోసం వేలాది మంది పేదలు ఎదురుచూస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కంటే అధికారుల దృష్టి ఇతర అంశాలపైనే ఉందని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్తీలలో నెలకొన్న ఈ దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతా మని పాలకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోన్ కన్వీనర్ ఆర్. అశోక్, జాకటి స్వామి, చంద్రశేఖర రావు, కృష్ణ, నయీం పటేల్, శ్రీను, యాదగిరి, దిలీప్, సోమలా నాయక్, తులసి బాయ్ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






