19 August, 2026 | 3:39 AM

రూ. లక్షలు ఇచ్చారు..

19-08-2026 01:30 AM
  1. లక్షణంగా అక్రమ నిర్మాణం పూర్తి చేశారు 
  2. రాజ బొల్లారంలో అనుమతి లేకుండా భారీ గోదాం నిర్మాణం 
  3. గత నెలలో అనుమతి లేదని సామాగ్రి సీజ్ చేసిన అధికారులు 
  4. ఆ వెంటనే పనులు ప్రారంభించిన యజమాని 
  5. పెద్ద మొత్తంలో చేతులు మారిన డబ్బులు 
  6. అనుమతిలేని గోదాము వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ అధికారులు 

మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి); మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణదారులు భారీ గోదాములు, భవనాలు నిర్మిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చేసిన ఫిర్యాదు పై అధికారులను గట్టిగా నిలదీస్తే అక్రమ నిర్మాణం దగ్గరికి వెళ్లి తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. రాజ బొల్లారం పరిధిలో మెడిసిటీ ఆసుపత్రికి వెళ్లే దారిలో నిర్మిస్తున్న భారీ షెడ్డు అధికారులు, ప్రజా ప్రతినిధుల అవినీతి అక్రమాలకు అద్దం పడుతోంది.

ఈ భారీ షెడ్డు పనులు మొదలైనప్పటి నుంచి మున్సిపల్ అధికారులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ గోదాం నిర్మిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు గత నెలలో అధికారులు వెళ్లి నిర్మాణ సామాగ్రి సీజ్ చేశారు. వెంటనే నిర్మాణదారుడు మున్సిపల్ అధికారులను కలిసి వచ్చి పనులు మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్థానికులు పనులు జరుగుతున్న విషయం మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదు. 

భారీ మొత్తంలో చేతులు మారిన డబ్బులు 

ఈ అక్రమ నిర్మాణం వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు డబ్బులు అందజేసి పనులు చకాచకా పూర్తి చేశారు. 

ఆగమేఘాల మీద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు 

నిబంధనల ప్రకారం ఇల్లు, గోదాములు నిర్మించిన వారికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టే విద్యుత్ శాఖ అధికారులు ఈ గోదాం వద్ద ఆగ మేఘాల మీద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. గోదాం అక్రమంగా నిర్మిస్తున్నారా, అన్ని అనుమతులు తో నిర్మిస్తున్నారా అనేది చూడకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి 

రాజ బొల్లారం వద్ద నిర్మిస్తున్న భారీ గోదాం పై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు తీసుకోకుంటే ఏ అధికారి ఎంత తీసుకున్నాడో, ప్రజా ప్రతినిధులు ఎంత డిమాండ్ చేశారో కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.