16 July, 2026 | 10:44 AM

పట్టాల వెంట దోపిడీ ముఠా!

07-06-2024 01:05 AM
  • రన్నింగ్ ట్రైన్‌పై బీభత్సం 

నాగర్సోల్ రైలుపై దాడి

వేగం తగ్గిన రైలులో ప్రయాణీకుల నగలు దోపిడీ

ట్రాక్ పక్కన కాపు కాసి అటాక్ చేసిన ముఠా

జనగామ, జూన్ 6(విజయక్రాంతి): రైలు కదులుతుండగానే అందులో కూర్చున్న ప్రయాణీకుల మెడలో నుంచి గుర్తు తెలియని ముఠా బంగారాన్ని చోరీ చేసింది. చాకచక్యంగా రైలు వేగం తగ్గగానే ఒక్కసారిగా ప్యాసింజర్ల బంగారాన్ని మాయం చేసిన దొంగల గ్యాంగ్ క్షణాల్లోనే అక్కడి నుంచి ఉడాయించింది. ఈ వింత చోరీ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండల పరిధిలో రైల్వే ట్రాక్‌పై జరిగింది. వివరాల్లోకెలితే.. బుధవారం అర్ధరాత్రి సికింద్రబాద్ నుంచి నాగర్సోల్  ఎక్స్‌ప్రెస్ బయల్దేరిం ది. జనగామ జిల్లా చిలుపూరు మండలంలోని నష్కల్, పెండి యాల్ గ్రామాల మ ధ్య కొన్ని రోజులుగా రైల్వే అండర్ బ్రిడ్జి పనులు నడుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతానికి చేరుకోగానే ప్రతీ రైలు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్తోంది.

సికింద్రబాద్ నుంచి బయల్దేరిన నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో నష్కల్, పెండియాల్ గ్రామాల మధ్యకు వచ్చింది. అన్ని రైళ్లలాగే నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ కూడా అక్కడికి రాగానే స్పీడ్ తగ్గి నెమ్మదిగా వెళ్తోంది. అదే సమయంలో ట్రాక్ పక్కన కొందరు దొంగలు కాచుకుని ఉన్నారు. కదులుతున్న రైలులో కిటికీ వద్ద కూర్చున్న ప్రయాణికుల మెడలో నుంచి బంగారు ఆభరణాలు అపహరించారు. సుమారు 10 మంది ప్యాసింజర్ల నుంచి దాదాపు 86 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు సమాచారం.

సుమారు పది మంది ముఠా కలిసి ఈ చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విజయవాడకు చెందిన అన్నెపు కవిత కాజీపేట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన 2 తులాల బంగారు గొలుసును అపహరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా బాధితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని కాజీపేట ఎస్సై తెలిపారు. కొందరు విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తమకు తెలిసిందన్నారు. ఎంతమంది ఈ చోరీకి పాల్పడ్డారు, ఎంతమంది బంగారాన్ని పోగొట్టుకున్నారనే విషయం తెలియ రాలేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దొంగలను వెతికే పనిలో జీఆర్‌పీ సిబ్బంది నిమగ్నమైందన్నారు.