ఏసు మృతికి పోలీసులే బాధ్యులు
ములుగు (జయశంకర్ భూపాలపల్లి), జూన్ 6 (విజయక్రాంతి): మావోయిస్టుల సమాచారం కోసం అడవిలోకి వచ్చి మందుపాతర పేలి మృతిచెందిన ఇల్లెందుల ఏసు అనే వ్యక్తి మృతికి పోలీసులు బాధ్యత వహించకుండా తమపై తోసే ప్రయత్నం చేస్తున్నారని మావోయిస్టు వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక లేఖ విడుదల చేశారు. కొంగాల అడవుల్లో కర్రెగుట్టపై మందుపాతర పేలి ఏసు మృతి చెందగా ఆయన కుమారుడు గాయపడ్డాడని, ఈ ఘటనపై తాము చింతిస్తున్నామని తెలిపారు. అటవీప్రాంతాల్లో మావోయిస్టుల సమాచారం తెలుసుకునేందుకు అమాయక ఆదివాసీలను పోలీసులు వాడుకుంటున్నారని, వేటగాళ్ల వేషం వేయించి అడవుల్లోకి పంపిస్తున్నారని మండిపడ్డారు.
మార్చి 6న వేటగాళ్ల రూపంలో అడవుల్లోకి వచ్చిన ఇన్‌ఫార్మర్ల ద్వారా తమ సమాచారం తెలు సుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు.. పిట్లపడ అడవుల్లో తమ దళంపై దాడి చేశారని, ఆ దాడిలో తమ సహచర కామ్రేడ్స్ అన్నె సంతోష్, మనీరాం, లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. అదే విధంగా ఏసును సైతం తమ సమాచారం తెలుసుకునేందుకే పోలీసులు వేటగాళ్ల రూపంలో అడవిలోకి పంపారని తెలిపారు. తమ ఆత్మరక్షణ కోసం ప్రజలు నిత్యం పనులు చేసుకునే స్థలాల్లో కాకుండా ప్రజలు తిరగని ఎత్తున కొండలపై అనేక ట్రాప్‌లు ఏర్పాటు చేశామని, ఈ విషయం పరిసర ప్రజలకు తెలుసన్నారు. ఏసు ఘటనను సాకుగా చూపి పార్టీకి వ్యతిరేకంగా వారి కుటుంబాలను, కొంతమంది యువకులను కూడ గట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపిం చారు.






