18 July, 2026 | 2:59 PM

‘మహా’ మంత్రులుగా 39 మంది

16-12-2024 01:55 AM

10 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ

ఇంకా ప్రకటించని మంత్రుల శాఖలు

ముంబై, డిసెంబర్ 15: మహా సీఎం, డిప్యూటీల ప్రమాణ స్వీకారం జరిగిన 10 రోజుల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరిగింది. 39 మందిని మంత్రులుగా నియమించగా.. వారి చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరగ్గా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మహా సీఎం ఫడ్నవీస్‌తో పాటు.. డిప్యూటీలు షిండే, అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. 

శాఖలపై లేని స్పష్టత.. 

39 మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే విషయంలో ఇంకా సరైన స్పష్టత లేదు. మహా ప్రభుత్వం గరిష్టంగా 43 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా.. 39 మంది ప్రస్తుతం ప్రమాణస్వీకారం చేశారు. మూడు పార్టీలకు చెందిన కీలకనేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మహారాష్ట్రకు నాగ్‌పూర్ శీతాకాల రాజధానిగా ఉంది. ఈ తరుణంలో ప్రస్తుతం అక్కడే ప్రమాణ స్వీకారం జరిగింది. చివరిసారిగా 1991లో ఇలా జరగ్గా.. మరలా ఇప్పుడు నాగ్‌పూర్ రాజ్‌భవన్‌లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 

బీజేపీకే అగ్రతాంబూలం.. 

మంత్రులుగా మూడు పార్టీలకు చెందిన నాయకులు ఉన్నా కానీ మంత్రి వర్గంలో కీలకశాఖలుగా ఉన్న రెవెన్యూ, విద్యుత్, పవర్, నీటిపారుదల మొదలయిన శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్సీపీ పార్టీ ఆర్థిక శాఖ, సహకార, వ్యవసాయ శాఖలను డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసినవారికి కూడా మరోమారు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. శాఖల ప్రకటన తర్వాత శివసేన, ఎన్సీపీ పార్టీలు కోరుకున్న శాఖలు వస్తాయో లేదో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.