జమిలి బిల్లు వాయిదా!
* నేటి ఎజెండాలో లేదు
* పునరాలోచనలో కేంద్ర ప్రభుత్వం
* మరింత ఆలస్యం కానున్న బిల్లు!
* సప్లమెంటరీ బిజినెస్‌గా బిల్లుకు ఛాన్స్?
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఒకే దేశం ఎన్నికకు సంబంధించిన జమిలి ఎన్నికల బిల్లు విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నెల16న సోమవారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఊహగానాలు వచ్చాయి. సభలో ప్రవేశపెట్టే అంశాలకు సంబంధించిన బిజినెస్ లిస్ట్‌ను కేంద్రం ఆదివారం విడుదల చేసింది. ఈ బిజినెస్ లిస్ట్‌లో జమిలి ఎన్నికల బిల్లుకు స్థానం లభించలేదు. దీంతో పార్లమెంట్‌లో జమిలి బిల్లు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లులను చేర్చకపోవడానికి గల కారణాలపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈనెల 12న జమిలి బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 13న బిల్లు ప్రతులను సభ్యులకు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి బిజినెస్ జాబితాలో బిల్లు ప్రస్తావన లేకపోవడంతో బిల్లులను కేంద్రం ప్రవేశపెడుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
జమిలి కోసం సవరణ..
లోకసభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఏ అధికరణను చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంట్ పదవీకాలంలో మార్పు కోసం 83వ అధికరణ, అసెంబ్లీ పదవీకాలం సవరణ కోసం 172 అధికరణను సవరించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలను రూపొందించడానికి పార్లమెంట్‌కు అధికారం కల్పించడానికి 327 అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది.
సప్లమెంటరీ బిజినెస్‌గా
కాగా వివిధ శాఖల పద్దులను పార్లమెంట్ ఆమోదించిన తరువాత జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే దేశం ఎన్నిక బిల్లు కొంత ఆలస్యం కానున్నట్లు సమాచారం. అయితే లోస్‌సభ స్పీకర్ అనుమతితో సప్లమెంటరీ బిజినెస్‌గా ఏ క్షణమైనా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అనధికార వర్గాల సమాచారం. ఈ నెల 20తో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఈ సమావేశాల్లో జమిలి బిల్లు ప్రవేశపెట్టడంపై సందిగ్ధత నెలకొంది.






