18 July, 2026 | 3:18 PM

Breaking News

మిస్ ఫ్రాన్స్‌గా ఎయిర్ హోస్టస్

16-12-2024 01:49 AM

34 ఏండ్ల వయసులో అందాల కిరీటం

అత్యంత పెద్ద వయసున్న మిస్ ఫ్రాన్స్‌గా రికార్డు

నిబంధనల మార్పుతో వరించిన అవకాశం

పారిస్, డిసెంబర్ 15: 95వ మిస్ ఫ్రాన్స్ పోటీల్లో 34 ఏండ్ల ఏంజెలిక్ అంగ్నారీ ఫిలోపన్ మొదటి స్థానంలో నిలిచింది. ఏంటి 34 సంవత్సరాల వయసులో కూడా మిస్ ఫ్రాన్స్ పోటీలకు అనుమతిస్తారా? అనే అనుమానం అందరిలో కలగడం సహజమే. కానీ ఇటీవలే మిస్ ఫ్రాన్స్ పోటీలకు సంబంధించి నిబంధనలను మార్చారు. దీంతో 34 సంవత్సరాల వయసులో కూడా ఏంజెలిక్‌కు పోటీ చేయడం కుదిరింది. ఈ అందాల కిరీటాన్ని గెలుచుకున్న  అత్యంత పెద్ద వయస్కురాలిగా ఏంజెలిక్ రికార్డు నెలకొల్పింది.

ఏంజెలిక్ 20 ఏండ్ల వయసులో మిస్ మార్టిన్‌క్యూ పోటీలో రన్నరప్‌గా నిలిచింది. అదే ఏంజెలిక్ 34 ఏండ్ల వయసులో ఫ్రాన్స్ అందాల కిరీటాన్నే సొంతం చేసుకుంది. ఫైనల్ పోటీలో 30 మంది పోటీదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అందాల ప్రదర్శన చేశారు. 

కేవలం కిరీటం మాత్రమే కాదు.. 

మిస్ ఫ్రాన్స్‌గా అవతరించిన ఏంజెలిక్‌కు కేవలం కిరీటం మాత్రమే కాకుండా మిస్ ఫ్రాన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఏడాది పాటు జీతం, పారిస్‌లో ఓ అపార్ట్‌మెంట్, అంతే కాకుండా వివిధ బహుమతులు కూడా సొంతం కానున్నాయి.