ఈ పండు కాస్ట్‌లీ గురూ!
ఎండాకాలం వచ్చిందంటే సూర్యుడంటే భయంతోపాటు మామిడి పండు వస్తుందన్న ఆనందమూ ఉంటుంది. సీజన్ మొదలవగానే ఎక్కడెక్కడ మామిడిపండ్లు కనిపిస్తాయని వెతుకుతుంటాయి కళ్లు. రసాలు, బంగినపల్లి, తోతాపరి అంటూ రకరకాల మామిడి పండ్లని కొనేస్తూ ఉంటాం. అయితే మియాజాకీ అనే పేరువిన్నారా? పేరు అదోరకంగా ఉంది కదా... దాని ధర తెలిస్తే రకరకాలుగా ఉంటుంది మరి.
మహా అయితే ఓ అయిదు వందలుండొచ్చు, ఇంకా వెక్కువైతే కేజీ వెయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఈ జాతి మామిడి పండు ఎక్కడైనా కనిపిస్తే కొనటానికి ముందు ఓసారి ఆలోచించుకోండి. ఈ పండు ధర కేజీ రెండున్నర లక్షలు. ఒక పండు అయితే తక్కువలో తక్కువగా రూ.50,000కి పైమాటే... అదీను సైజులో చిన్నపండు అయితే.
అదీ మరీ మియాజాకీ అంటే అంతగా ఏముంది పండులో అనుకుంటున్నారా? జపాన్ దేశంలో మాత్రమే పండే మామిడి రకం ఈ మియాజాకీ. ఈ మామిడిలో యాంటీఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్, ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు సమస్య ఉన్నవారికి ఇవి బాగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ మామిడి తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మామిడిలో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు ఉన్నాయి. అంతే కాదు జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, కే వంటి పోషకాలు మియాజాకీ మామిడిలో పుష్కలంగా ఉన్నాయట. అందుకే ఈ పండుకి అంత డిమాండు. ఇతర మామిడి చెట్ల పెంపకంతో పోలిస్తే ఈ జాతి మామిడి పెంపకం చాలా కష్టం. మియాజాకీ మామిడి ఒక్కొక్క కాయ బరువు 350 నుంచి 900 గ్రాముల వరకూ ఉంటుంది. సాధారణంగా అంటే సరాసరిన ఒక్కక్కటి 350 నుంచి 400 గ్రామలుంటుంది.
ఈ మామిడి విత్తనాలను జపాన్ నుంచి తెచ్చి ఇప్పుడు ఇండియాలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మియాజాకీ మామిడిని సాగు చేస్తున్నారు. అయినా తక్కువ చెట్లు ఉండటం వల్ల ఇంకా ధరలు మాత్రం అలాగే ఉన్నాయి.






