ఇది పోరు గడ్డ! ప్రతి విజయం వెనుక ఓ పోరాటం

18-04-2024 12:10:00 AM

తెలంగాణ పోరాటాల భూమి, సమ్మక్క, సారలమ్మల దగ్గర నుంచీ, రామ్‌జీగోండు, కొమరం భీమ్‌ల గిరిజన పోరాటాలతో దద్దరిల్లిన రణభూమి. ప్రజాకళలతో ఉద్యమాలని నిర్మించుకున్న రణక్షేత్రం. తెలంగాణ చరిత్ర నిండా సాధించుకున్న ప్రతీ విజయం వెనుకా ఒక పోరాటం ఉంది. ప్రజల తిరుగుబాట్లున్నాయి. నైజం పాలకులతోనూ, దొరలతోనూ పోరాడిన ప్రజా పోరాటాల నేల ఇది. తనకు తానుగా నిలబడటానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి కూడా యుద్ధమే జరిగింది. తొలి, మలిదశ ఉద్యమాలలో నెత్తుటి తిలకం దిద్దుకున్నది. ఇది తెలంగాణ నిత్య పోరాటాల చైతన్య భూమి.. 

ఒక్కసారి ఆ చైతన్యాన్ని తలుచుకుంటూ...

కొన్ని ఉద్యమాలు ప్రాంతీయ ప్రయోజనాల కోసమే జరిగినా అవి ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ఉద్యమం. ఒక రాష్ట్రం తనదైన అస్తిత్వం కోసం పరాయి పాలకులతో పోరాడినంతగా పోరాడింది. 1969లో ఎగసిపడ్డ నిరసన జ్వాలల తాకిడి అలాగే కొనసాగి ఉంటే ఆనాడే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటై ఉండేది. కానీ, ఆనాటి ప్రభుత్వ రాజకీయ చర్యలతో హింసాత్మకంగా మారి అప్పటికి చల్లారింది. అయితే ఏ ఉద్యమానికి ముగింపు ఉండదు. ఒక వైఫల్యం రాబోయే రోజుల మార్గదర్శి అవుతుంది. పొరపాట్లని సరిదిద్దుకునే పాఠం అవుతుంది. 

చారిత్రక నేపథ్యం

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, అస్థిత్వ మొదలైన కారణాలు అనేకం కనిపింస్తున్నప్పటికీ ప్రాంతీయ అసమానతలను కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవొచ్చు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు తక్కువ అభివృద్ధి చెంది ఉంటే, మరి కొన్ని పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అయితే ప్రాంతాల మధ్య అసమానతలు అనేవి వనరులు లేకపోవడం వలన ఏర్పడినవి కావు. వనరుల అసమాన పంపిణీ దీనికి కారణంగా చెప్పొచ్చు. ఆర్థికాభివృద్ధి జరిగిన దశాబ్దాల తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయంటే వనరులు సక్రమంగా పంపిణీ జరగలేదనే అర్థం. తెలంగాణ విషయంలో జరిగింది కూడా ఇదే. తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వనరుల సమస్య ఏనాడు ఎదురు కాలేదు. ఈ పరిస్థితికి కారణం. తెలంగాణ ప్రాంతానికి భూమిశిస్తు వసూళ్ళు అధికంగా ఉండి అదనంగా ఎక్సైజ్ సుంకం కూడా ఉండటం కారణం అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి నుంచి పాలనపరమైన భారం, జీతభత్యాలు ఇవ్వలేని స్థితి, అప్పుల భారం వంటి సమస్యలు వెంటాడాయి. 

వనరులకు కొదువే లేదు

ఏదైనా ఒక రాష్ట్రం ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఆ ప్రాంతానికి ప్రకృతి ప్రసాధించిన వనరులు, మానవ ప్రయత్నంతో కల్పించుకున్న వసతులు, వాటి వలన వచ్చే ఆదాయం ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ దృష్ట్యా చూసినప్పుడు తెలంగాణ ప్రాంతం చాలా సంపన్నమైనదని అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి ప్రసాధించిన కృష్ణా, గోదావరి నదులు 70 నుండి 80 శాతం పరివాహక ప్రాంతాన్ని తెలంగాణలోనే కలిగి ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఉన్న అతి పెద్ద బొగ్గు గనులు కేవలం తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటికి తోడు.. సున్నపురాయి, గ్రానైట్ తదితర విలువైన ఖనిజ సంపద కూడా ఈ ప్రాంతం సొంతం. దాదాపు 43 శాతం అటవి సంపదను ఈ తెలంగాణ ప్రాంతం కలిగి ఉంది. తెలంగాణ ప్రాంతానికి పుష్కలమైన వనరులకు తోడు పటిష్టమైన రాజధాని నిర్మాణం. పాలన యంత్రాంగానికి కావలసిన భవన సముదాయాలు, అందులో ముఖ్యమైన రాజ్‌భవన్, రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణం, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, కళాశాలలు, ఆసుపత్రులు నిజాం హయాంలో నిర్మిత మయ్యాయి. పారిశ్రామిక రంగంలో అనేక ఫ్యాక్టరీలు, రవాణ రంగంలో రైల్వే లైన్లు, నీటి పారుదల రంగంలో ప్రాజెక్టుల నిర్మాణం వందలాది చెరువులు తెలంగాణ సొంతం. 

పాలనాపరమైన నిర్ణయాల్లో లోపాలు

అయితే ప్రాంతీయ అసమానతల గురించి చర్చ వచ్చినప్పుడల్లా చాలామంది నైసర్గిక అంశాల గురించి, ప్రకృతి సహజమైన అంశాల గురించి ప్రస్తావించడం ఒక అనవాయితీగా మారిపోయింది. కానీ ఒక ప్రాంతం వెనుకబాటుకు, అభివృద్ధికి వనరులొక్కటే కారణం కాదు. వనరులతో పాటు సాంకేతికత, వ్యవస్థీకృత, సంస్థాగత ఏర్పాట్లు కూడా వెనుకబాటుకు కారణమవుతాయి. ఆధునిక కాలంలో వెనుకబాటు తనంలో కొంత ఎక్కువ పాత్ర వహించేది పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలు. ఒకే పాలనా ప్రాంతంలో ఒక భాగానికి ఆధునిక సౌకర్యాలు అందడానికీ, మరొక భాగానికి అవి అందకపోవడానికీ ఈ పాలనాపరమైన నిర్ణయాలే కారణమవుతాయి. వాస్తవానికి ఒక ప్రాంత వెనుకబాటుకు కారణాలను గుర్తించాలంటే మాత్రం చరిత్రలోకి వెళ్తే తప్ప సమస్యలను అర్థం చేసుకోలేం. ఆ ప్రాంతాల పరిస్థితులను, వివిధ ప్రాంతాలతో పొల్చినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలను గమనిస్తే ఇక్కడ నెలకొన్న వెనుకబాటుతనపు చరిత్ర అర్థం అవుతుంది.

ఆ కల మిగిలే ఉన్నది

1969 ఉద్యమం ఆంధ్రా ప్రాంత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే ఎజెండాని ముందుకు తెచ్చింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో ఉద్యోగాల కేటాయింపులో తెలంగాణకి జరిగిన అన్యాయం వల్ల మొదలైన పోరాటం తెలంగాణ అంతటా వ్యాపించింది. ఆ తరువాతి పరిణామాలు ఆ ఉద్యమాన్ని తాత్కాలికంగా అణచి వేసినా.. ఆ సెగ రగులుతూనే వచ్చింది. అదే మలిదశ పోరాటానికి స్పష్టతనిచ్చింది కూడా. అయితే భౌగోళిక తెలంగాణ స్వప్నమైతే సాకారమైనట్టేగానీ సామాజిక తెలంగాణా కోసం చేయాల్సిన కృషి చాలానే ఉంది. జనాభా శాతం ప్రకారమే అధికారంలోనూ వాటా ఉన్నప్పుడే అది సామాజిక తెలంగాణ అనగలం. మలిదశ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడే ఈ సామాజిక తెలంగాణ అంశం కూడా మేధావులు ప్రశ్నలు లేవనెత్తినా, ముందు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అది చర్చించవచ్చని పక్కకు పెట్టారు. అధికారం మళ్ళీ కొన్ని వర్గాలకే పరిమిత మయ్యింది. అలా కాకుండా అన్ని సామాజిక వర్గాలకీ వారి జనాభాశాతాన్ని బట్టి సరైన వాటా క్కినప్పుడే అది సామాజిక తెలంగాణ అవుతుంది. లేదంటే ఒక పటాన్ని చూసి మురిసిపోవుడే మిగులుతుంది. 

 సంగిశెట్టి శ్రీనివాస్