08-01-2026 01:10:44 AM
ఖమ్మంలో ముగ్గురు మంత్రులు.. ౩౦% కమీషన్లు
* మా ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో పనులన్నీంటిని 90 శాతం పూర్తిచేస్తే, ఆ పనులను తామే పూర్తిచేసినట్లు గొప్పలు చెబుతూ, కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకు గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆ ప్రాజెక్టు కమీషన్ల కోసం దానిని నత్తనడక నడిపిస్తున్నారు.
కే తారకరామారావు
ఖమ్మం, జనవరి 7 (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రు లు తమకు ఏదో మేలుచేస్తారని ప్రజలు భావిస్తే, వారు రైతులకు కనీసం యూరియాని అందించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ఈ జిల్లా మంత్రులు కమీషన్లను మాత్రం బాగా దండుకుంటున్నా రని, ప్రతి పనిలో 30% కమీషన్లు తీసుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నా రని, జిల్లాలోని మంత్రులు మొనగాళ్లు కాదని, మోసగాళ్లని ఆయన ఎద్దేవా చేశారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులకు ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన సన్మానసభలో కేటీఆర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదైనా జిల్లాకు ఒక్క మంత్రి పదవి లభించినా ఆ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, కానీ ఖమ్మం జిల్లా మాత్రం అందుకు భిన్నంగా ఉందని, ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంతో సహా మరో ఇద్దరు మంత్రులు ఉన్నా ఇక్కడ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
ఒకరిని మించి ఒకరు 30% టాక్స్ వసూలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా భ్రష్టమైపోయిందని అందరినీ మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో పనులన్నీంటిని 90 శాతం పూర్తిచేస్తే, ఆ పనులను కాంగ్రెస్ పూర్తిచేసినట్లు గొప్పలు చెబుతూ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మ డి ఖమ్మం జిల్లాలో రైతులకు గోదావరి జలాలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును డిజైన్ చేశారని, ఆ ప్రాజెక్టు కమీషన్ల కోసం నత్తనడక నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
మంత్రి పొంగు లేటి దీపావళికి బాంబులు పేలుతాయని రెండేళ్ల కిందట అన్నాడని, ఇప్పటికి రెండు దీపావళ్లు పోయినా, ఆ బాంబులు మాత్రం ఇంకా పేలలేదని విమర్శించారు. ఇన్ని చెప్పే ఆయనకు ఏదైనా ఇబ్బంది కలిగితే, బీజేపీ కాళ్లు పట్టుకుంటాడని, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్స్ అయితే మోదీ, అదానీ కాళ్లు పట్టుకొని కేసు అవ్వకుండా బీజేపీకి మోకరిల్లాడని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇక ఇంకో మంత్రి తుమ్మల తాను వస్తున్నానని కార్పొరేటర్ల ఇళ్లచుట్టూ తిరిగి, ఓ ముగ్గురిని పట్టుకొని రేవంత్‌రెడ్డి ఇంటికి పోయాడన్నారు.
అయినా తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, బీఆర్‌ఎస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని, ప్రజల తమవైపు ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో సర్పంచ్ ఎన్నికల్లో నిలబడేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకలేదని, కానీ ఇదే కాం గ్రెస్ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ సర్పంచులు గెలిచారంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరే కత ఉందో ఆలోచించాలని, పార్టీని వీడుతు న్న వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, యువతకు, కొత్తవారికి అవకాశం ఇచ్చి వారిని నాయకులుగా తయారు చేస్తామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ భరోసానిచ్చారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాలు లే వని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలేనని దుయ్యబట్టారు. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా? రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? ఇక ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకోండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
ఇప్పుడు రెండేళ్లు అయినా గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. తాను ఖమ్మం వచ్చేటపుడు పాలేరు నియోజకవర్గాల్లో కొందరు రైతులతో మాట్లాడి, వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నానని, వారం తా కాంగ్రెస్ పార్టీపై గరం అవుతున్నారని ఆ యన తెలిపారు. మార్పు అని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా అని అడిగితే.. పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి కాళ్లతో తన్నే దున్నపోతుని తీసుకొచ్చామని రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారని కేటీఆర్ చెప్పారు.
అప్పుల రాష్ట్రా న్ని తమకు వదిలివెళ్లారని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి రాష్ట్ర ప్రజల సంక్షేమ పథకాల కోసం కేసీఆర్ అప్పులు చేశారని తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పులన్ని రాష్ట్ర భవిష్యత్‌కు పెట్టుబడులేనని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు దిండిగల రాజేందర్, ఖమర్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.