08-01-2026 01:09:35 AM
టీజీపీడబ్ల్యూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తామంటూ వాణిజ్య ప్రకటనలు ఇస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కంపెనీలు.. ఆ సరుకులను చేరవేసే కార్మికుల ప్రాణాలతో మాత్రం చెలగాటమాడుతున్నాయని తెలంగాణ గిగ్, ఫ్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కేవలం 10 నిమిషాల డెలివరీ పేరుతో జెప్టో, జొమాటో వంటి సంస్థలు విధిస్తున్న అశాస్త్రీయమైన గడువుల కారణంగా అమాయక డెలివరీ బాయ్స్ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మండిపడ్డారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గిగ్ వర్కర్ల దయనీయ స్థితిపై రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ ఫ్యాక్టరీల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే జోక్యం చేసుకోవాలని టీజీపీడబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.ప్రమాదాల్లో చిక్కుకున్న కార్మికులకు న్యాయం జరిగేలా ‘వర్క్‌మెన్స్ కాంపె న్సేషన్ యాక్ట్’ను కఠినంగా అమలు చేయాలని కోరింది. విధుల్లో మరణించిన జెప్టో వర్కర్ అభిషేక్ కుటుంబానికి వెంటనే రూ. 5 లక్షల ప్రమాద మరణ బీమా అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రిలో ఉన్న షానవాజ్‌కు వైద్య చికిత్స అందేలా చూడాలని కోరింది. కార్మికుల భద్రతను గాలికొలేస్తున్న జెప్టో, జొమాటో సంస్థలపై బాధ్యతను నిర్ణయించి, 10 నిమిషాల డెలివరీ మోడల్’ను నిషేధించేలా ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేసింది.