తెలుగువాళ్లకు కొత్త కమర్షియల్ చిత్రమిది
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న కొత్త సినిమా ‘పళ్లిచట్టంబి‘. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌కు రానుందీ చిత్రం.
ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో మంగళవారం ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. “50వ దశకం నేపథ్యంగా సాగే చిత్రమిది. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం” అన్నారు. హీరోయిన్ కయాదు లోహర్ మాట్లాడుతూ.. “పళ్లిచట్టంబి నాకు ఒక ప్రత్యేక చిత్రం. ఈ సినిమాలో నేను నటించిన రెబెకా క్యారెక్టర్ నా మనసుకు ఎంతో దగ్గరైంది. రెబెకా అందాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారు. ఒకరకంగా నాకు డ్రీమ్ రోల్ ఇది. ఈ సినిమా చూసి థియేటర్ల నుంచి ఒక మంచి భావోద్వేగంతో బయటకు వస్తారు.
ఆ ఫీలింగ్ మీ మనసులో ఉండిపోతుంది” అని చెప్పారు. డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ మాట్లాడుతూ.. “డైరెక్టర్ రాజమౌళి మా సినిమా గురించి స్పందించారు. ప్రేక్షకులకు కూడా నచ్చే చిత్రమిది. మనుషులంతా ఒక్కటే అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. పళ్లిచట్టంబి అనేది ఒక టర్మ్. కథలో టైటిల్ రోల్. అందుకే టైటిల్‌ను మార్చకుండా ప్రతి భాషలోనూ ఇదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నాం.
కేరళలో 50వ దశకంలో జరిగిన ఘటన ఈ సినిమాకు నేపథ్యం. రాజకీయంగా ఎన్ని మార్పులు వచ్చినా మనుషులుగా మన జీవిత సంఘర్షణ మారలేదు. ఆ ఒరిజినాలిటీ స్క్రీన్ మీదకు తెచ్చేందుకు పీరియాడిక్‌గానే సినిమాను రూపొందించాం” అని తెలిపారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త కమర్షియల్ మూవీ అవుతుంది.
మలయాళం సినిమాలంటే మనం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల్లాగే భావిస్తాం. కానీ, ‘పళ్లిచట్టంబి’ ఒక భారీ మంచి కమర్షియల్ మూవీ. తెలుగులో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు చాణక్య, చైతన్య, చరణ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ మేఘశ్యామ్, డిస్ట్రిబ్యూటర్ వెట్రి, గీత రచయిత రాంబాబు గోసాల తదితర చిత్రబృందం పాల్గొన్నారు.




