21 April, 2026 | 9:53 PM

ఎంపీ అర్వింద్ అబద్ధాలకోరు

09-05-2024 02:48 AM

డాడీ, మోడీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతడు

మేయర్ పదవి కోసం నా వద్ద రూ.4 కోట్లు వసూలు 

డబ్బులు అడిగితే పార్టీ నుంచి బహిష్కరించారు

ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదు

బీజేపీ బహిష్కృత నేత మీసాల శ్రీనివాసరావు

నిజామాబాద్, మే 8 (విజయక్రాంతి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పచ్చి అబద్ధాలకోరు అని, మోడీ, డాడీ పేరు చెప్పుకొని పబ్బం గడుతున్నాడని బీజేపీ బహిష్కృత నేత మీసాల శ్రీనివాసరావు విమర్శించారు. తన భార్యను మేయర్ చేస్తానని తన వద్ద రూ.4కోట్లు  తీసుకున్నాడని ఆరోపించారు. అర్వింద్ అన్యాయాలపై నిలదీస్తే తనను పార్టీ నుంచి బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రావు, తన భార్య నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేటర్ సరిత, ఇతర బీజేపీ నాయకులతో కలిసి నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అర్వింద్ పొగరుబోతు వ్యాఖ్యలతో ప్రజలు ఆయనను ఈసడించుకుంటున్నారని అన్నారు.

మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్న ప్రజలు.. అర్వింద్ ను మాత్రం ఈ ఎన్నికల్లో ఓడించాలనుకుంటున్నారని చెప్పారు. తమను పార్టీ నుంచి బహిష్కరించే అర్హత రాష్ట్ర క్రమశిక్షణ సంఘానికి మాత్రమే ఉందని.. పార్టీ జిల్లా అధ్యక్షుడికి లేదని స్పష్టంచేశారు. అర్వింద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విభజించి పాలించే రాజకీయాలతో పార్టీని బలహీనపరుస్తున్నాడని మండిపడ్డారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తొలగించడంలో అర్వింద్ కీలకపాత్ర పోషించాడని ధ్వజమెత్తారు. అర్వింద్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని, రాజకీయ వ్యభిచారి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమిష్‌షా సభలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రసంగించకుండ అర్వింద్ అనుచరులు మైక్ లాగేసుకుని ఎమ్మెల్యేను అవమానించారని గుర్తుచేశారు. ఆర్రూ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ సైతం అర్వింద్ వ్యవహార శైలితో విసిగిపోయారని పేర్కొన్నారు.