06-12-2025 12:51:43 AM
దీనికి బాధ్యత కాంగ్రెస్ సర్కారే
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): సాయి ఈశ్వర్‌చారి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని సామాజిక న్యాయం పూర్తిగా కూలిపోయిందనడా నికి పెద్ద నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హక్కులను అమలు చేయకపోవడం, ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, వివక్షలతో తీవ్ర నిరాశ, ఆవేదనకుగురై సాయి ఈశ్వర్‌చారి బలిదానం చేసు కున్నారన్నారు.
బీసీలను మోసం చేస్తూ, వారి హక్కులను హరిస్తూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారమే ఈ దారుణానికి కారణమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటలు చెప్పి తీరా ఆ హామీని నిలుపుకోకుండా మోసం చేశారని విమర్శించారు.
ఫీజు బకాయిలు చెల్లించడం లేదు
బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదని బీజేపీ చీఫ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు.. గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ బీసీలను నయవంచకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఈ వివక్షే ఒక యువకుడి మృతికి కారణమైందన్నారు. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు.. -ఇది బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వ్యవహార శైలికి ప్రతిబింబమన్నారు.
బీజేపీ ఈ ఘటనను తీవ్రం గా ఖండిస్తోందని, ఈ దారుణానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన అన్ని హామీలనూ వెంటనే అమలు చేయాలకన్నారు. బీసీల హక్కుల కోసం -తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు. బీసీలకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అన్యాయం, అహంకార పాలనకు ముగింపు పలికేది ప్రజలేనని ఆయన పేర్కొన్నారు.