06-12-2025 12:49:18 AM
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం
పట్టుపడుతున్నవి కొన్ని.. వదిలేస్తున్నవి మరికొన్ని..
కొంతమంది అధికారుల చేతివాటమే కారణమంటున్న రైతులు
రైతాంగానికి జరుగుతున్న తీవ్రనష్టం
ఇంటర్‌స్టేట్ చెక్‌పోస్టులున్నా ఆగని వరిధాన్యం అక్రమ దందా
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహ ద్దుల్లో ఉన్న 15 చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో అక్రమంగా ధాన్యం రవాణా దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర రైతన్న పాలిట శాపంగా మారుతోంది. ఇతర రాష్ట్రా ల నుంచి ధాన్యం తరలి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో యథేచ్ఛగా అక్రమ ధాన్యం దందా కొనసాగుతోంది.
ఒకటి, రెండుసార్లు అక్రమంగా వస్తున్న వరిధాన్యం లారీలను పట్టుకున్నప్పటికీ.. ముడుపుల బాగోతంతో చాలావరకు చూసీ చూడనట్లుగానే వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ధాన్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సివిల్ సప్లయ్ శాఖ రాష్ట్రంలోని 17 జిల్లాలలో 56 ఇంటర్నల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, వాటిలో సీసీ కెమెరాలతో పాటు ఆకస్మిక తనీఖిలుంటాయని చెప్పినా.. ఆచరణ లేదనే విమర్శలు ఉన్నాయి. వానాకాలం సీజన్‌లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 159.15 లక్ష ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఈ ధాన్యంలో 75 లక్షల టన్నులను ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖ ద్వారా సేకరించనున్నట్లు ప్రకటించింది. అందులోనూ 53 లక్షల టన్నులకు ఎఫ్‌సీఐ ద్వారా మద్దతు ధర ఏ గ్రేడ్‌కు రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 చొప్పున మద్దతు ధరకు కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్ రూపంలో అందిస్తుంది.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం వల్ల దిగుబడి తగ్గింది. రాష్ట్రంలోని రైస్ మిల్లులలో ధాన్యం నిల్వలు తగ్గిపోయాయి. దీంతో తెలంగాణకు చెందిన మిల్లర్లు, వ్యాపారుల కన్ను పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలపై పడింది. ఆయా రాష్ట్రాల్లో దళారులను పెట్టుకుని.. వరిధాన్యం కొనుగోలు చేసి.. ఇక్కడికి అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. తాజాగా కర్ణాటక, ఏపీ నుంచి ధాన్యం లోడుతో రాష్ట్రానికి వచ్చిన లారీలు పట్టుబడుతున్నాయి.
17 జిల్లాల్లో 56 ఇంటర్‌స్టేట్ చెకింగ్‌లేవీ..
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ వడ్ల రవా ణా అరికట్టేందుకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 56 ఇంటర్-స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ ఏర్పా టు చేసి, ఆకస్మిక తనిఖీలు చేస్తూ కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అగ్రిక ల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, పోలీసు శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ ప్ర క్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెబుతున్నారు.
అ యితే కర్ణాటక ధాన్యం లారీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ- కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతమైన కృష్ణ వాసునగర్ చెక్‌పోస్టు వద్ద ఇటీవలనే అర్ధరాత్రి ఏడు ధాన్యం లారీలు రాగా ఒక లారీనే మాగనూరు పోలీసులు నల్లగట్టు సమీపంలో పట్టుకొన్నారు. దాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. సంబంధిత ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రులకు సమాచారం అందించారు. ఆ అధికారులు మరుసటి రోజు వరిధాన్యం లోడును పరిశీలించి, ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే కర్ణాటక పంపించారు.
మానిటరింగ్ వదిలేసి.. మనీలాబింగ్ చేసి..
రాష్ట్రంలో రావాణాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఉండేవి. వాటిని తొలగించడం, సివిల్ సప్లయి అధికారులు సైతం ఏర్పాటు చేశామన్న ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల్లో సిబ్బంది పర్యవేక్షణ లో పించడం, కొన్ని చెక్ పోస్టుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతోనే కర్ణాటక, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ధాన్యం వస్తున్నట్లు సమాచారం.
సన్నధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వడంతోనే ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నిత్యం చెక్ పోస్టులపై మానిటరింగ్ చేయాల్సిన రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు సైతం చోద్యం కారణంగా యథేచ్ఛగా ధాన్యం తెలంగాణకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సివిల్ సప్లయ్ ఉన్నతాధికారులు స్పందించి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆగని వరిధాన్యం అక్రమ రవాణా
ఏపీ నుంచి ధాన్యం తెలంగాణకు రాకుం డా మిర్యాలగూడ డివిజన్ పరిధిలో వాడపల్లి, సాగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. మిర్యాలగూడ మండలంలోని అలగడప గ్రామ సమీపంలో బుధవారం రాత్రి సమయంలో 11 లారీలను పట్టుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే సమయంలో మరికొన్నింటిని వదిలేశారనే విమర్శలు వస్తు న్నాయి. గత యాసంగిలోనూ వాడపల్లి అం తర్‌రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చిన 7 ధాన్యం లారీలను సీజ్ చేశారు. ఇప్పుడు మ ళ్లీ వానాకాలంలో పునరావృతమవుతోంది.
తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తారా?
ఏపీ నుంచి వచ్చిన ఎనిమిది లారీలను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం రైతులు గత సోమవారం పట్టుకున్నారు. గతేడాది కూడా వందలాది వరిధాన్యం లారీలు ఏపీ నుంచి కట్టుకాసారం మీదుగా తెలంగాణకు వచ్చాయి. పోలీసులు, సంబంధిత అధికారులకు సమాచారం అందింంచినా పెద్దగా ఫలితం లేకపోవడంతో.. నేరుగా రైతులే రంగంలోకి దిగి ఏపీ లారీలను అడ్డుకున్నారు.
దీంతో డ్రైవర్లు సమాధానం కూడా చెప్పకుండా లారీలను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఇప్పటికైనా సివిల్ సప్లయ్ అధికారులు స్పందించి చెక్ పోస్టులను నిత్యం పర్యవేక్షణ చేస్తూ అక్రమంగా ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేస్తారా..? లేకుంటే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తూ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తారా? అనేది చూడాలి మరి!