ఈ స్టోర్ విధానం ద్వారా పనులు వేగవంతం
కరీంనగర్, మార్చి 12 (విజయక్రాంతి): వినియోగదారులకు, రైతులకు సేవలలో వేగాన్ని, పారద ర్శకతను పెంచుతూ, క్షేత్రస్థాయిలో పనులను సులువుగా చేయడానికి ఈ స్టోర్ విధానం ఉపయోగపడుతుందని పీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ వి గంగాధర్ తెలిపారు. ఈ విధానం ద్వారా అవసరమైన విద్యుత్ సామగ్రిని ముం దుగానే ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని, అధికారులు తమకు అవసరమైన మెటీరియ ల్ ను కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా సిస్టమ్లో నమోదు చేసి, ఈ స్టోర్స్ నుండి తీసుకుని వెంటనే పనులను ప్రారంభించే అవకాశం ఏర్పడిందన్నారు.
ఇంతకు ముందు మెటీరియల్ పొందడానికి పలు దశల పేపర్ ప్రక్రియలు పూర్తి చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు పేపర్లెస్ విధానంలో ఆన్లైన్ ద్వారా మెటీరియల్ బుక్ చేసి, అవసరమైనప్పుడు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రావడంతో సమయం ఆదా అవుతుందని వివరించారు.
ప్రత్యేకంగా రైతులకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ మార్పులు, లైన్ మరమ్మత్తులు వంటి పనులను త్వరగా పూర్తి చేయడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ విధానం వల్ల విద్యుత్ శాఖలో ఆధునిక సాంకేతికత వినియోగం పెరిగి, సేవల నాణ్యత మరింత మెరుగుపడిందని ఎస్‌ఈ వెల్లడించారు.




