‘పోలీసుల అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరు పరచాలి’
మావోయిస్టు పార్టీ నుంచి లేఖ విడుదల
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూన్ 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండ లం తడపాలలో బుధవారం మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యులు రీతా, మోతీ, ఇర్మాల్‌తో పాటు మరో ముగ్గు రు గ్రామస్తులను బుధవారం పోలీసు లు అదుపులోకి తీసుకున్నారని, వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని మావోయిస్టు పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో గురువారం లేఖ విడుదలైంది. బాంబులు ఎక్కడెక్కడ పెట్టారంటూ మావోయిస్టు సభ్యులు, గ్రామస్తుల ను పోలీసులు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, వారి ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను ఆపాలి: రాష్ట్ర పౌర హక్కుల సంఘం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 30 ఎన్‌కౌంటర్లలో 130 మంది హత్య చేశాయని రాష్ట్ర పౌరహక్కల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే ఆపరేషన్ కగార్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 12న ములుగు జిల్లాలో నిరాయుధులైన మావోయిస్టు పార్టీ సభ్యులు రీతా, మోతి, ఇడ్మార్‌తో పాటు మరో ముగ్గురు సాధారణ పౌరులను అదుపులోకి తీసుకున్నారన్నారు.
వారిని ఎన్‌కౌంటర్ చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని, వారిని వెంటనే కోర్టులో హజరుపర్చాలని డిమాండ్ చేశారు.






