ఆ వార్తలు అవాస్తవం
- మీడియా ప్రచారం బాధ్యతాయుతంగా లేదు
- విచారణ నిరాకరణపై సీజేఐ సూర్యకాంత్
- నీట్ లీక్ తప్పిదాలకు చెక్ పెట్టాలి
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 24: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు తాను నిరాకరించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నీట్ లీక్ తప్పిదాలకు ఇకననైనా చెక్ పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్‌లీక్‌ల తర్వాత చేపట్టిన సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్టీఏ, కేంద్రాన్ని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.
తాను విద్యార్థులపై దాడుల పిటిషన్లను తిరష్కరించినట్లు వస్తున్న వార్తలపై శుక్రవారం సీజేఐ సూర్యకాంత్ స్పందించారు. అది వినతిపత్రమేనని, పిటిషన్ కాదన్నారు. ఉదయం 10 గంటల వరకు ఒక్క పేజీ పిటిషన్ కూడా దాఖలు కాలేదని, వినతిపత్రాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణించాలని సీజేఐ వివరించారు. గత రెండు రోజులుగా, ఒక కేసు దాఖలైందని పూర్తిగా తప్పుడు ప్రకటన చేశారని, విచారణకు తాను నిరాకరించానని మీడియా తప్పుగా ప్రచారం చేయడంలో బాధ్యతాయుతంగా లేదన్నారు.
మిశ్రానో లేక మరెవరో పంపిన ఒకే ఒక్క వినతిపత్రాన్ని రిట్ పిటిషన్‌గా పరిగణించలేనని సీజేఐ తేల్చి చెప్పారు. నీట్ చుట్టూ చోటు చేసుకున్న తప్పిదాలకు ఇకనైనా చెక్ పెట్టాలని, ముగింపు పలకాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు ఇక మీదట పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ), కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీట్, పలు పరీక్షల పేపర్ లీక్‌లపై దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.
కేంద్రం చేపట్టిన చర్యలను మేమే దగ్గరుండి సమీక్షించాలని అనుకుంటున్నామని, ఎలాంటి మార్పులు చేస్తున్నారో తెలియజేయాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించారని, సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్ కోసం కేంద్రం ఎంత దూరమైనా వెళుతుందని, ఇప్పటికే అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆ వివరాలను సమగ్రంగా న్యాయస్థానానికి అందజేస్తామని, అందుకు కొంత గడువు కావాలని ధర్మసనాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.






