04-02-2026 01:36:12 AM
ఐదు పోక్సో కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు ఖరారు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే కామాంధుల పట్ల హైదరా బాద్ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ని రూపిస్తూ.. తాజాగా నగరంలోని వేర్వేరు కేసుల్లో కోర్టులు సంచలన తీర్పులు వెలువరించాయి. బేగంపేట, బంజారాహిల్స్, భవానీ నగర్, ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు భారీ జైలు శిక్షలు ఖరారైనట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ పి. లావణ్య నాయ క్ జాదవ్ మంగళవారం వెల్లడించారు.
తండ్రికి ఆమరణ జైలు శిక్ష
తన 12 ఏళ్ల కన్నకూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన కసాయి తండ్రికి మరణించే వరకు కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అలాగే, 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ పొరుగు వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించగా, 8 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి అఘాయిత్యం చేసిన మరో వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.
మరో రెండు వేర్వేరు ఘటనల్లో 4, 8 ఏళ్ల చిన్నారులను వేధించిన ఇద్దరు నిందితులకు చెరో ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. జైలు శిక్షలతో పాటు బాధితులకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పరిహారం చెల్లించాలని నిందితులను ఆదేశించింది. ఈ కేసుల్లో నిందితులకు శిక్షలు పడటంలో భరో సా కేంద్రం పాత్ర కీలకమని డీసీపీ లావణ్య పేర్కొన్నారు.