కులవివక్ష చూపిన వారిని అరెస్ట్ చేయాల్సిందే
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
కామారెడ్డి, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి): ‘గ్రామాల్లో దళితులపై కులవివక్ష చూపిన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో బుధవారం దళితులకు ఆలయ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.‘ గ్రామంలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై బక్కి వెంకటయ్య విచారణ జరిపారు.
దళితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితులు తాము ఏ విధంగా వివక్షకు గురవుతున్నామో ఛైర్మన్‌కు చెప్పుకున్నారు. తమకు గ్రామంలో అలయాల్లోకి ప్రవేశాలు కల్పించడం లేదని, అగ్రవర్ణాల పెద్దలు తమను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ఇంటింటికీ విరాళాలు సేకరించి శివాలయం నిర్మించడం జరిగిందని, విగ్రహ ప్రతిష్ఠ రోజు తమ కాలనీలో విగ్రహాన్ని ఊరేగించేందుకు అగ్రవర్ణాలు వివక్ష చూపారని, చివరికి విగ్రహం తాకేందుకు కూడా ఒప్పుకోలేదన్నారు.
గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే అందరికి కావాల్సిన వ్యక్తి అని తాము ఉచితంగా డప్పు కొట్టడానికి వెళ్తే అవసరం లేదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి శ్మశాన వాటికలో అంత్యక్రియలకు తమకు అవకాశం కల్పించడం లేదన్నారు. అనంతరం ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇప్పటికీ కులం అంటూ వివక్ష చూపడం బాధాకరమన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇలా బతకాలని చెప్పలేదన్నారు.
కులాలు అనేది వృత్తిపరమైనవి మాత్రమేనని, వాటిని అక్కడికే పరిమితం చేసి అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఈ తరహా ఘటనలు ఇటీవల చాలా వెలుగు చూస్తున్నాయన్నారు. ఈ ఘటనలో ఎంతమందిపై కేసులు నమోదు చేశారని, విచారణ ఎలా జరిపారని ఎస్త్స్రని ప్రశ్నించారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్త్స్ర చెప్పగా పూర్తిస్థాయిలో విచారణ జరిపి ముగ్గురిపైనే కాకుండా ఘటనకు కారణమైన వాళ్లు 30 మంది తేలినా అందరిపై కేసు నమోదు చేయాలని సూచించారు.
జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నర్సన్నపల్లి గ్రామం లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, ఇది చీకటి రోజుగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల చివరి వారంలో గ్రామంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని, కులవివక్ష, ప్రభుత్వ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించాలని, ఆ కార్యక్రమానికి తనకు ముందే సమాచారమిస్తే తాను కూడా వస్తానని పేర్కొన్నారు.
కఠిన చర్యలు తప్పవు: అడిషనల్ కలెక్టర్ విక్టర్
గ్రామంలో కులవివక్ష చూపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ హెచ్చరించారు. రోజురోజుకు కులవివక్ష రూపాంతరం చెందుతుందని, ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, శ్మశాన వాటికలో అందరికి అనుమతి ఉంటుందని, అక్కడ కూడా వివక్ష చూపిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కిందకు వస్తుందని పేర్కొన్నారు.
సమాజంలో ఉన్న అన్ని వర్గాలను గ్రామంలోని అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, లేకపోతే చట్ట వ్యతిరేకత కిందకు వస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో గ్రామంలో ఎలాంటి వివక్ష కనిపించకూడదని పేర్కొన్నారు. అనంతరం దళితులతో కలిసి ర్యాలీగా వెళ్లి గ్రామంలోని హనుమాన్ మందిరం, శివాలయాలలో కొబ్బరికాయ కొట్టి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. అనంతరం ఆడిషనల్ కలెక్టర్ విక్టర్, అధికారులు దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రాజశేఖర్, డీటీడీవో సౌజన్య, తహశీల్దార్ హిమబిందు, అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, భీం ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రవి, గ్రామస్థులు స్వామి, రాజు, బాలరాజు, నర్సింలు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




