ఆత్మకూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
క్రీడా మైదానంలో లైట్లు, డిగ్రీ కళాశాలకు బోర్వెల్ హామీ
ఆత్మకూరు, జూలై 13: ఆత్మకూరు మండలంలో పలువురు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు. జాతర మైదానంలో క్రీడాకారుల అభ్యర్థన మేరకు 240 వాట్ల లైట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, మేడపల్లి గ్రామంలో హైమాస్ట్ లైట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి సమస్యలను తెలుసుకుని, సొంత నిధులతో బోర్వెల్ వేయిస్తానని హామీ ఇచ్చారు.
తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో అధికారులను కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






