వెయ్యొంతుల... జోష్
- కూసుమంచిలో 1,000 బైకులతో భారీ ర్యాలీ
- ఓపెన్ టాప్ జీప్ లో ముందుకు సాగి.. మరింత ఉత్సాహం నింపిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి బీఆర్‌ఎస్ తీరుపై భగ్గు..
- అసలు దొరే ఫాం హౌస్ కు పరిమితమయ్యాడని.. పిల్ల కాకులు కారు కూతలు మానుకోవాలని ఎద్దేవా
- పాలేరులో మళ్లీ గెలిచేది.. నిలిచేది కాంగ్రెస్సేనన్న శీనన్న
కూసుమంచి, (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1,000 బైకులతో నాయకన్ గూడెం నుంచి కూసుమంచి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Information Minister Ponguleti Srinivasa Reddy) ఓపెన్ టాప్ జీపులో ముందుకు సాగుతూ.. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కూసుమంచి ప్రధాన సెంటర్లో కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు.
3,475 రోజుల మీ పాలనలో చేసిందేమీ లేదు...*పిల్ల కాకులు కారు కూతలు మానుకోవాలంటూ హెచ్చరిక ప్రజలు బీఆర్‌ఎస్ దొరను ఫామ్ హౌస్ కే పరిమితం చేశారనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలనపై బీఆర్ ఎస్ నేతలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
3,475 రోజుల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. పేదలకు ఇందిరమ్మ ఇళ్లిచ్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లకు ఉచిత విద్యుత్, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇలా ఎన్నో చేసామని వివరించారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా...తమ పాలనలో చూపామని అన్నారు. అసలు పెద్ద దొరనే ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడని, పిల్ల కాకులు కారు కూతలు మానుకోవాలని హితవు పలికారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని పేదల గడపకు చేర్చాం..
ప్రజల దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి..సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పేదల ఇంటి గడపలకు చేర్చి వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, దళిత, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వ లబ్ధి కలిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
పాలేరులో మళ్ళీ గెలిచేది... నిలిచేది కాంగ్రెస్సే
పాలేరు నియోజకవర్గానికి.. రూ.కోట్లాది నిధులతో ఎంతో చేశామని, భవిష్యత్ లో ఇంకెంతో చేస్తానని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పాలేరు రిజర్వాయర్ ను తీవ్ర నిర్లక్ష్యం చేశారని, ఇక్కడి రైతులను విస్మరించి మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు నీటిని తరలించారని.. ఇప్పుడు గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్లుగా.. మాట్లాడడానికి సిగ్గుండాలని తీవ్రంగా హెచ్చరించారు. పాలేరు అంటేనే కాంగ్రెస్ అని, పాలేరు నియోజకవర్గం అంటే తనకు సొంతిల్లు అని, ఎవరెన్ని పొర్లుదండాలు పెట్టినా..
మళ్ళీ ఇక్కడ గెలిచేది, నిలిచేది ముమ్మాటికీ కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జురి వెంకటరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హఫీజ్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, జూకూరి గోపాలరావు, కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి, పాలేరు సర్పంచ్ బానోత్ నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






