24 March, 2026 | 5:08 PM

అడవికి నిప్పు పెట్టిన కేసులో ముగ్గురి అరెస్ట్

24-03-2026 03:17 PM

- 14 రోజుల రిమాండ్

కొల్లాపూర్ రూరల్: అమ్రాబాద్ పులుల అభయారణ్యం కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ఎర్రపెంట సెక్షన్ సూలాలకుంట ప్రాంతంలో అడవికి అక్రమంగా నిప్పు పెట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం... మొలచింతపల్లికి చెందిన ఏదుల నాగశేషి, కుడికిళ్ల గ్రామానికి చెందిన కొత్త విష్ణు, ముక్కిడిగుండం గ్రామానికి చెందిన బడ్డుల రాముడులను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు అడవిలోకి అక్రమంగా ప్రవేశించి నిప్పు పెట్టడంతో విలువైన అటవీ సంపదకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, వన్యప్రాణుల మనుగడకు తీవ్ర ముప్పు ఏర్పడిందని అధికారులు తెలిపారు. జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కొల్లాపూర్ రేంజర్ వాణి కుమారి పర్యవేక్షణలో సెక్షన్ అధికారులు శివకుమార్, ముజీబ్ గోరి, బీట్ అధికారులు కిరణ్ కుమార్, నాగార్జున గౌడ్, కోర్టు డ్యూటీ బీట్ అధికారి రామాంజన్ ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.