calender_icon.png 12 November, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొన్న పోలీసు కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

12-11-2025 09:59:20 AM

చెన్నై: తమిళనాడు( Tamil Nadu) రాష్ట్రం శివగంగ(Sivaganga) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పోలీసు వాహనం ఢీకొని బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ సంఘటనతో కారు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డు దిగ్బంధనకు దిగారు. మృతులను మధురై జిల్లాలోని చిట్టంపట్టికి చెందిన ప్రసాద్ (25), అతని భార్య సత్య (20), వారి రెండేళ్ల కుమారుడు అశ్విన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివగంగలోని అనంజియూర్‌లో బంధువు అంత్యక్రియలకు హాజరైన తర్వాత కుటుంబం మధురైకి తిరిగి వస్తుండగా రాత్రి 8 గంటల ప్రాంతంలో వారు సక్కుడి సమీపంలో ఉన్నప్పుడు రామనాథపురం జిల్లాలోని ఒక పోలీసు ఇన్స్పెక్టర్ కారు వారి బైక్‌ను ఢీకొట్టిందని, వారందరూ రోడ్డుపై పడిపోయారని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో, ప్రసాద్ అక్కడికక్కడే మరణించగా, సత్య, అశ్విన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణలు విడిచారు. ఈశ్వరికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసు డ్రైవర్‌పై చర్య తీసుకునే వరకు ప్రసాద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించిన బాధితుల బంధువులు రోడ్డును దిగ్బంధించారు. శివగంగ పోలీసు సూపరింటెండెంట్ ఆర్. శివ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చిన తర్వాత, రాత్రి 9.30 గంటలకు గ్రామస్తులు నిరసనను విరమించారు. మృతుల మృతదేహాలను మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి (జీఆర్‌హెచ్)కి తరలించారు.