calender_icon.png 18 February, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే మాటగా.. ఒకే బాటగా!

18-02-2026 01:53:04 AM

బీసీల్లో మార్పు మొదలు.. రాజ్యాధికారం దిశగా అడుగులు

బీసీల్లో చైతన్యం కోసం తీవ్రంగా కృషిచేస్తున్న బీసీ సంఘాలు

రాజకీయాల్లో బీసీల వాటాపై విజయక్రాంతి కథనాలతో చైతన్యం

* జనరల్ స్థానాల్లో ఇప్పటివరకు పెత్తనం చెలాయించిన అగ్రవర్ణ నాయకులు.. తాము పోటీలో నిలబడితే, బీసీ వర్గాల నుంచి మద్దతు ఉండదని గ్రహించి తమ అనుచరుల్లో బీసీలను ఎంపికచేసి నిలబెట్టినట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనపడుతున్నాయి. దీనితో రిజర్వేషన్లు లేకున్నప్పటికీ.. 55 శాతం వరకు వార్డుల్లో బీసీలు గెలవడానికి అవకాశం ఏర్పడింది. ఇదే సూత్రం.. చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలోనూ ఫలితం తెచ్చిందని బీసీ వర్గాలు బలంగా చెబుతున్నారు.

అంటే ఐకమత్యంగా ఉంటే, ఇప్పటివరకు పెత్తనం చెలాయించినవారుకూడా దిగిరాకతప్పని పరిస్థితులు నెలకొంటాయనేది స్పష్టమైంది.

మార్పు మొదలయ్యింది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. అన్నట్టుగా బీసీలు కలిసికట్టుగా అడుగులు వేస్తున్నారు. దశాబ్దా లుగా బీసీల్లో కొరవడిన చైతన్యం, అవగాహన తాజా పంచాయతీ, మున్సిపల్ ఎన్ని కల్లో ప్రస్పుటంగా కనిపించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీసీల ముందడుగు స్పష్ట మయ్యింది. బీసీలకు పూర్తిస్థాయిలో 50 శాతం రిజర్వేషన్లను ఏ పార్టీ ఇవ్వకపోయి నా.. జనరల్ స్థానాల్లో నిలబడ్డ బీసీ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించడం గమనార్హం. పైగా మున్సిపాలిటీల పగ్గాలు చేపట్టిన నేతల్లో సుమారు 60 శాతం వర కు బీసీలే ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. అలాగే కొద్దిరోజుల క్రితం ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వ్ అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

బీసీ గళంగా ‘విజయక్రాంతి’..

గడిచిన కొంతకాలంగా బలహీనవర్గాలకు చెందిన మేధావులు, రిటైర్డ్ అధికా రులు, వివిధ రంగాల్లో నిపుణులు, రాజకీయ నేతలు సంఘాలు స్థాపించి తమ వర్గాల్లో చైతన్యానికి తీవ్రంగా కృషిచేస్తున్నా రు. రాజకీయంగా ఎదగాలంటే కలిసికట్టుగా సాగాల్సిన అవసరాన్ని బీసీ వర్గాల కు నూరిపోశారు. దీనితో బీసీ ప్రజల్లో మెల్లగా రాజకీయ చైతన్యం మొదలయ్యిం ది. దీనికి తోడు.. బీసీ వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జరుగు తున్న అన్యాయాలు, నష్టాలను మొదటి నుంచి ‘విజయక్రాంతి’ దినపత్రిక ఏకరువుపెడుతూనే ఉంది.

పైగా రాజకీయంగా పట్టు నిలుపుకుంటే.. మిగతా అంశాలన్నింటిలోనూ పట్టు చిక్కుతుందని.. బీసీ నేతల గొంతుగా విజయక్రాంతి మారి.. వారి డిమాండ్లను సమాజానికి వినిపించేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేవలం విజయక్రాంతి దినపత్రిక మాత్రమే బీసీ వర్గాల గొంతుగా మారిందని చాట్ జీపీటీ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. అటు బీసీ సంఘాలు, మేధావులు.. ఇటు విజయక్రాంతి దినపత్రిక బీసీల గొంతుగా మార డంతో, బీసీ వర్గాల్లో చైతన్యం పెరిగింది. ఐకమత్యంపై అవగాహన పెరిగింది. అందరూ కలిసికట్టుగా అడుగులు వేయడంతో, మొదటి ఫలితం కండ్లముందు సాక్షాత్కారమయ్యింది.

బలంగా బీసీల అడుగులు..

తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీల మెజారిటీ స్పష్టమయ్యింది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఏ పార్టీ ఇవ్వలేదు. ఇచ్చిన బీసీ రిజర్వేషన్లలోఎలాగూ బీసీలే గెలుపొందారు. దీనితో పాటు ముఖ్యంగా, జనరల్ స్థానాల్లోనూ చాలా మంది బీసీలే ఎన్నికవ్వడం బీసీల్లో మార్పుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 105 మున్సిపాలిటీల్లో దాదాపు 64 మంది చైర్‌పర్సన్లుగా ఎన్నికైనవారు బీసీలే కావడం గమనార్హం.

అంతేకాకుండా.. వైస్ చైర్మన్లుగా ఎన్నికైనవారిలో సుమారు 40 శాతానికంటే ఎక్కువ మంది బీసీలే ఉండటాన్ని బీసీ సంఘాల ప్రతినిధులు ఎత్తిచూ పిస్తున్నారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లేకాదు.. జనరల్ స్థానాలతో కలుపుకొని చూస్తే, సుమారు 55 శాతం వరకుకూడా బీసీలే గెలుపొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రాజకీయ ప్రస్తానంలో బీసీలు మొదటిఅడుగు వేసినట్టుగా స్పష్టమవుతోంది. ఇది మరో బలమైన అడుగుకు పునాదిలా మారుతుందని బీసీ నేతలు అంటున్నారు.

తప్పనిసరి పరిస్థితులు..

మొన్నటివరకు జనరల్ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లాంటివారికి అవకాశం ఉండేది కాదు. కేవలం రెడ్డి, వెలమ, కమ్మ లాంటి అగ్రకులాలకే అవకాశం ఉండేది. దీనిని మొదటి నుంచి మౌనంగానే బీసీలు భరిస్తూ వచ్చారు. కానీ కొంత కాలంగా బీసీల్లో చైతన్యం కనపడుతోంది. రాజకీయాలపై వారిలో అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో బీసీ ప్రజలు ఐక్యం గా కదులుతున్నారు. బీసీల్లో వచ్చిన ఐక్యత బయటకు స్పష్టంగా కనపడుతోంది.

దీనితో జనరల్ స్థానాల్లో ఇప్పటివరకు పెత్తనం చెలాయించిన అగ్రవర్ణ నాయకు లు.. తాము పోటీలో నిలబడితే.. బీసీ వర్గా ల నుంచి మద్దతు ఉండదని గ్రహించి.. తమ అనుచరుల్లో బీసీలను ఎంపికచేసి నిలబెట్టినట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనపడుతున్నాయి. దీనితో రిజర్వేషన్లు లేకున్నప్పటికీ.. 55 శాతం వరకు వార్డుల్లో బీసీలు గెలవడానికి అవకాశం ఏర్పడింది. ఇదే సూత్రం.. చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎం పికలోనూ ఫలితం తెచ్చిందని బీసీ వర్గాలు బలంగా చెబుతున్నారు. చైర్‌పర్సన్ 

స్థానాలు అన్ రిజర్వుడ్ (జనరల్) కేటగిరీలో ఉన్నప్పటికీ.. బీసీల్లో వ్యతిరేకత వచ్చే పరిస్థితులు నెలకొనడంతో.. భవిష్యత్తులో పెద్ద అవకాశాలు (ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీ, ఎంపీ, జడ్పీ చైర్మన్) దక్కించుకోవాలంటే.. వీటిని బీసీలకే వదిలేస్తే మంచిదనే ఉద్దేశంతో చాలా చోట్ల ఛైర్మన్లతోపాటు, వైస్ ఛైర్మన్ల పదవులనుకూడా బీసీలకే అప్పగించినట్టు తెలుస్తోంది. అంటే ఐకమత్యంగా ఉంటే, ఇప్పటివరకు పెత్తనం చెలా యించినవారుకూడా దిగిరాకతప్పని పరిస్థితులు నెలకొంటాయని బీసీ ప్రజలు ఆలోచిస్తున్నారు.

మరో అడుగు వేయాలి..

ఇప్పుడు ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైతే ఐక్యంగా ముందుకు సాగా రో.. అదే ఐక్యంగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోనూ.. అంతకంటే ఎక్కువ ఐక్యంగా, కలిసికట్టుగా ముందు కుసాగితే.. బీసీల రాజ్యాధికారం సాధించడానికి ఎంతో కాలం పట్టదని బీసీ సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చినవారందరూ రాజకీయంగా బలపడటంతోపాటు, ఆర్థికంగాకూడా మరింత బలపడాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ ఎన్నికల్లోనూ బీసీల పట్టును నిలుపుకునే అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు ఇతరుల మద్దతు, సాయంతో పదవుల్లోకి వచ్చిన బీసీలు.. ఆర్థికంగా, అంగబలాన్ని సాధిస్తే, తమ కాళ్ళపై తామే నిలబడే స్థాయికి చేరుకుంటారు. అప్పుడు బీసీ ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే, బీసీలు రాజకీయ పట్టును సాధించే అవకాశం వస్తుంది.

మొత్తానికి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వనప్పటికీ.. జనరల్ స్థానాల్లో ఎక్కువ మంది బీసీలే గెలుపొందడం రాజకీయంగా మొదటి అడుగుగా చెప్పవచ్చు. బీసీల్లో కలిగిన చైతన్యం, అవగాహనతో.. చైర్‌పర్సన్లు, వైస్ చైర్మన్ పదవులను తప్పనిసరి పరిస్థితుల్లో కట్టబెట్టాల్సి వచ్చిందనేది వాస్తవం. ఇక్కడకూడా జనరల్ స్థానాల్లో చాలావరకు బీసీలే పాలకపగ్గాలు చేతబట్టారు. ఇప్పుడు వచ్చిన అవకాశంతో మరింత బలపడి.. రాబోయే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు దక్కాల్సిన 50 శాతం సాధించుకునే దిశగా బీసీలు కదిలే సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే మార్పు మొదలయ్యింది.. మరో బలమైన అడుగు వేయాల్సిన అవసరం ఉంది.!

మహిళలకు 33 శాతం.. 

ఇదిలా ఉండగా.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అనే డిమాండ్ కూడా చాలాకాలంగా వినపడుతూ ఉంది. మంత్రివర్గంలోనూ మహిళలకు 33 శాతం అంటే.. కనీసం 6 స్థానాలు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే స్థానం కల్పించారు. మరో నల్గురికి అవకాశం కల్పిస్తే.. 33 శాతానికి వారి సంఖ్య చేరుకుంటుందన్నమాట. పైగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ కూడా కొంతకాలంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు దక్కాల్సినన్ని బెర్తులను కట్టబెట్టాలనే డిమాండ్‌కూడా వినపడుతోంది. 

మంత్రివర్గంలో బీసీలకు 50 శాతం.. 

రాజకీయ పదవుల్లో బీసీ వాటాను పక్కనపెడితే.. రాష్ట్ర మంత్రివర్గంలో బీసీల కోటాను నింపాల్సిన అవస రం ఎంతైనా ఉంది. కచితంగా 50 శాతం మంత్రిప దవు లను బీసీలకు కేటాయించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినపడుతూనే ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో మొత్తం 16 మంది (సీఎంతో కలుపుకొని) ఉండగా.. ఇందులో కేవలం ముగ్గురు (పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి) మాత్రమే బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మంత్రివర్గంలో మొత్తం 18 మందికి స్థానం కల్పించవచ్చు. అంటే మరో ఇద్దరికి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మంత్రివర్గంలో బీసీలకు 50 శాతం అంటే.. 9 మంత్రి పదవులు దక్కాలి. కానీ ప్రస్తుతం కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినపడుతోంది. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరినీ తప్పించే అవకావం ఉంటుందనికూడా చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన బీసీ వర్గాలకు అత్యధిక మంత్రి పదవులు దక్కేలా కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినపడుతోంది.

సి.ఎల్. రాజం

చైర్మన్, విజయక్రాంతి