20 May, 2026 | 2:44 AM

అచ్చంపేటలో పశువుపై పెద్దపులి దాడి

20-05-2026 12:28 AM

భయాందోళనలో గ్రామస్తులు

అచంపేట, మే 19: మండల పరిధిలోని శివారు తండా గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన పశువుపై పెద్దపులి దాడి చేసి చంపేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు పాతావత్ మోత్యా నాయక్ ప్రతిరోజులాగే సోమవారం రాత్రి తన వ్యవసాయ పొలంలో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా ఒక ఎద్దును పెద్దపులి దాడి చేసి చంపేసినట్లు గుర్తించారు. అనంతరం ఆ పశువును సమీప అడవిలోకి ఈడ్చుకెళ్లి సగం వరకు తిన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.గ్రామస్తుల ప్రకారం రైతుల పొలాల అధిక భాగం అమ్రాబాద్ టైగర్ రిజర్వు సమీపంలో ఉండటంతో అడవి జంతువుల సంచారం తరచుగా కనిపిస్తోందని చెబుతున్నారు. చనిపోయిన ఎద్దు విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని తెలిపారు.ఈ ఘటనతో శివారుతండా పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పంట పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పశువులపై దాడి చేసిన పెద్దపులి భవిష్యత్తులో మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లోకి క్రూర జంతువులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, రాత్రి పహారా పెంచాలని, రైతులకు రక్షణ చర్యలు కల్పించాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.