calender_icon.png 21 January, 2026 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో పులుల కలకలం

21-01-2026 12:52:12 AM

  1. భయాందోళనలో ప్రజలు

  2. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ఆవు దూడలపై దాడి

కామారెడ్డి జిల్లాలో అనుమానాస్పదంగా చిరుత మృతి

జుక్కల్/అశ్వారావుపేట, జనవరి 20 (విజయక్రాంతి): కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పులుల సంచారం కలకలం రేపుతోంది. పల్లెల్లోకి పులులు వస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల అటవీప్రాంతంలో పెద్ద పులి రెండు ఆవు దూడలపై దాడి చేయడంతో ఆ పశువులు మృతి చెందాయి. దీంతో సమీప గ్రామాల గిరిజనులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.కావిడగుండ్ల గ్రామానికి చెందిన సోడెం నాగేశ్వరరావు అనే వ్యక్తి తన పశువులను తన జామాయిల్ తోటలో ఉంచారు.

మంగళవారం నాగేశ్వరరావు పశువులను మేతకు తోలుకెళ్లేందుకు జామాయిల్ తోట వద్దకు వెళ్లాడు.అక్కడ ఒక ఆవు చనిపోయి ఉండటం, మెడ కౌరికి ఉండటం, మరో గిత్త దూడ సుమారు 100 మీటర్ల దూరంలో వాగు వద్ద ముక్కలు ముక్కలుగా పడి ఉండటంతో పశువుల మందపై పెద్ద పులి దాడిచేసినట్లుగా అనుమానించి గ్రామస్తులకు,ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. రేంజర్ మురళీ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన ప్రాంతానికి వెళ్లి పులి సంచార జాడలను గుర్తించారు. పశువులపై దాడిచేసింది పులిగా నిర్ధారించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆయన హెచ్చరించారు.

అనుమానాస్పదంగా పులి మృతి  

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్, దోస్త్ పల్లి శివారులో నాలుగు రోజుల క్రితమే ఒక చిరుత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతికి గల కారణాలు చెప్పగలుగుతామని వారు పేర్కొన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు దోస్త్‌పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపిందని,దూడ కళేబరంపై విషం వేసినట్లు చెబుతున్నారు.మళ్లీ అక్కడికి వచ్చిన చిరుత దూడ మాంసం తినడంతో మృతి చెంది ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

దీంతో జతగా వచ్చిన మరో చిరుత గర్జిస్తూ ప్రజలకు భయాందోళనకు గురి చేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత విష ప్రయోగంతో చనిపోయిందా లేకుంటే కరెంట్ షాక్ ఏమైనా తగిలిందా అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోస్టుమార్టం తర్వాత తెలియజేస్తామని బీట్ ఆఫీసర్ రాములు తెలిపారు. అయితే బస్వాపూర్, దోస్పల్లి, బంగారుపల్లి గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరిగా పొలం పనులకు వెళ్లకూడదని సూచించామని పేర్కొన్నారు.