08-12-2025 01:22:12 AM
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కఠిన చర్యలు : సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, డిసెంబరు 7 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికా రులతో సిపి సమీక్షా సమావేశం నిర్వహించి, భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలీసు బలగాలను కేటాయించాలని సూ చించారు. ఎన్నికల విడతల వారీగా అన్ని రూట్లలో పెట్రోలింగ్ వాహనాలను కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని సీపీ ఆదేదించారు. ఈ మార్చ్ లో ప్రజలకు ఎటువంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
శాంతిభద్రతలకు విఘా తం కలగకుండా ఉండేందుకు, కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్ల బైండోవర్లను పూర్తి చేశామని వెల్లడించారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వ్యక్తులు లేదా పార్టీల ప్రతినిధులపై చట్ట ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేదించారు.
ప్రలోభాలు, బెదిరింపులు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై ఏమాత్రం ఉపేక్ష చూపకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, తద్వారా ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీ య పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని సీపీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, మాధవి, విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, వేణుగోపాల్, వాసాల సతీష్, తదితరులుపాల్గొన్నారు.