హనుమాన్ జయంతి బైక్ ర్యాలీకి పటిష్ట బందోబస్తు
కరీంనగర్,(విజయక్రాంతి): పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నాడు టౌన్ డివిజన్ పోలీసు అధికారులతో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న నేరాల విచారణ గురువారం నగరంలో జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు. చీటింగ్ ఫోర్జరీ కేసులపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న చీటింగ్, ఫోర్జరీ కేసుల పురోగతిని సీపీ సమీక్షించారు.
బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా విచారణను వేగవంతం చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ భద్రతా చర్యలు నగరంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు.
ర్యాలీ సందర్భంగా సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. అవసరమైన ప్రాంతాల్లో ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని టౌన్ ఏసీపీని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్, ఎస్సైలు భాస్కర్ రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.




