2 July, 2026 | 1:05 AM

టీఎంసీ ఎంపీ మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

02-07-2026 12:31 AM
  1. వీడియో షేర్ చేసి వాపోయిన ఎంపీ
  2. గతంలో బీజేపీపై నోరు పారేసుకున్నారనే దాడి?

కోల్‌కతా, జూలై 1: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లు, కుళ్లిపోయిన కూరగాయలతో దాడి జరిగింది. బుధవారం పశ్చిమ బంగాల్ నాడియాలోని ఆమె పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. బయట గుమిగూడిన జనసమూహం తనపై గుడ్లు, కుళ్లిపోయిన కూరగాయలతో దాడి చేశారని ఎంపీ ఆరోపించింది. కాగా జనసమూహం వీడియోను మొయిత్రా తన ఎక్స్‌లో పంచుకున్నారు. డీజీపీతో కూడా ఫోన్‌లో మాట్లాడానని, తమపై దాడిని అడ్డుకోవాలని, వెంటనే పోలీసులను పంపించాలని వేడుకున్నట్లు తెలిపారు. కానీ పోలీసులు దాడి చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించారని మొయిత్రా వాపోయారు.

ఈ దాడులపై కనీసం పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసింది ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలేనని ఆరోపించారు. స్థానిక టీఎంసీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో ఉన్న కృష్ణనగర్ ఎంపీ కూడా ఈ వీడియోలను తన మొబైల్‌లో రికార్డు చేశారు. మొయిత్రా ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు. గతంలో బీజేపీపై మహువా మొయిత్రా అనేకసార్లు నోరు పారేసుకున్నారు. ఈ దాడికి ఇదే కారణంగా భావిస్తున్నారు.

పశ్చిమ బంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఎంసీ నాయకులపై గుడ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అభిషేక్ బెనర్జీ, సుజోయ్ హజ్రా, బప్పాదిత్య దాస్ గుప్తా, మహమ్మద్ జసీముద్దీన్, ఉదయన్ గుహా, విజయ్ సింగ్‌పై గుడ్లతో దాడులు చేశారు. కాగా కోడిగుడ్ల దాడులపై పశ్చిమ బంగాల్ హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని మంగళవారమే ఆదేశించింది. ఆదేశించి 24 గంటలు గడవకముందే మరో కోడిగుడ్ల దాడి జరగడం విశేషం.