విద్యాసంస్థలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదు
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లాలోని విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాలలో సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Dr. Shabarish) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ములుగు జిల్లాను కూడా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా, యువతను, ప్రజలను మమేకం చేస్తూ మత్తు మాదకద్రవ్యాలపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
అందులో భాగంగా విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండేందుకు గాను విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాలలో 100 గజాల పరిధిలో సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు, మధ్యం విక్రయించకూడదు అని తెలియజేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇటువంటి కఠిన నిర్ణయాలు అమలుచేస్తున్నట్లు తెలియజేశారు. ఎవరైనా నిబంధనలు మీరినట్లయితే అట్టి దుకాణాలు లేదా వ్యాపార సముదాయాలపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.




