16-02-2026 12:31:22 AM
మెదక్ బల్దియాలో జెండా ఎవరిదో..
నేడే ఉత్కంఠకు తెర
కుర్చీ మాదే అంటున్న కాంగ్రెస్.. బిఆర్‌ఎస్
క్యాంపుల్లో కౌన్సిలర్లు..
మెదక్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ కుర్చీ గెలుచుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. చైర్మ న్ కుర్చీ తమదేనన్న ధీమా బీఆర్‌ఎస్ లో కనిపిస్తోంది. అంత ఈజీగా వదులుకోకూడదన్న పట్టుదలకాంగ్రెస్ లోనూ కనిపిస్తోంది. మరోవైపు చైర్మన్ ఎన్నిక సోమవారం నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను అధి కార యంత్రాంగం ఆదివారం పూర్తి చేసింది. మెదక్ లో అంతా ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తోంది కానీ, ఏ క్షణంలో ఏం జరుగు తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపెట్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సోమవారం ఉదయం 11 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట మధ్య జరగనుంది. 14వ తేదీన ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఆ పదవిని కైవసం చేసు కోవడానికి రంగంలో దిగాయి. మెదక్ లో 32 వార్డులు ఉండగా 15 బిఆర్‌ఎస్, 14 కాం గ్రెస్, 2 బీజేపీ, ఒకటి బీఎస్పీ గెలుపొందాయి.
అయితే మ్యాజిక్ ఫిగర్ ఎవ్వరికీ రాక పోవడంతో ఇద్దరు బీజేపీ, ఒకరు బీఎస్పీ అభ్యర్థులు చైర్మన్ పదవికి కీలకంగా మారనున్నారు. 17వార్డు బీఎస్పీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపొంది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ ల సంఖ్య 15కు చేరింది. ఇదిలా ఉండగా అటు బిఆర్‌ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ లో చేరి సమానంగా వచ్చాయి. అయితే ఇద్దరూ బీజేపీ అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీకి చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది.
నర్సాపూర్ మున్సిపల్ లో మొత్తం 15వార్డులు ఉండగా కాంగ్రెస్ కు 6, బీఆర్‌ఎస్ కు 5, బీజేపీ 4 సీట్లు గెలిచాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో నర్సాపూర్ మున్సిపల్ లో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో చూడాలి మరి. ఇకపోతే రామాయంపెట్ లో మొత్తం స్థానాలు 12 కాగా కాంగ్రెస్ 8 సీట్లు గెలిచాయి. తూప్రాన్ లో 16 వార్డులకు గాను బిఆర్‌ఎస్ 9 సీట్లు గెలుపొంది చైర్మన్ పదవికి మెజార్టీ సాధించాయి.