మళ్లీ జోడీగా..
ప్రస్తుతం వరుస విజయాలతో మళ్లీ తన మార్క్ మాస్ ఇమేజ్‌ను తారస్థాయికి చేర్చారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి తన 111వ చిత్రాన్ని ప్రారంభించిన బాలా.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ప్రాజెక్టునూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ తన 112వ సినిమాను చేయబోతున్నారు.
ఈ ప్రకటన బయటకు వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమాకు సంబంధించిన కథ, బాలకృష్ణ పాత్ర, బ్యాక్‌డ్రాప్ వంటి విషయాలపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో వినవస్తున్నాయి. కొరటాల శివ తన గత చిత్రాల మాదిరిగానే బలమైన సామాజిక అంశంతోపాటు భారీ మాస్ ఎలిమెంట్స్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాడని టాక్. ఇదిలావుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు సినీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీ
ఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్ ఆయన భార్య బసవతారకం పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో బాలకృష్ణ కాంబో చాలా కొత్తగా, సహజంగా అనిపించిందన్న అభిప్రాయం సినీప్రియుల నుంచి వ్యక్తమైంది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ జోడీని తెరపై చూపించాలని మేకర్స్ భావిస్తున్నారట.
ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కేవలం గ్లామర్ కాకుండా కథలో కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని టాక్. అందుకే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం విద్యాబాలన్‌ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కొరటాల శివ సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రత్యేక స్థానం ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాబాలన్ లాంటి నటిని తీసుకుంటే సినిమాకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారని సమాచారం.






