బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం
- పోక్సో చట్టం కింద కేసు నమోదు.. అరెస్ట్ట్
- అమ్మాయి నగ్న వీడియోలు చిత్రీకరించి పలుమార్లు లైంగికదాడి
- గతేడాది వేరే అమ్మాయిని వివాహమాడిన కానిస్టేబుల్
- కేసు వివరాలు వెల్లడించిన రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్
మణికొండ, జూన్ 27 (విజయక్రాంతి): సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ క్రమశిక్షణ తప్పాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అతని ఇంటి దగ్గర్లో ఉండే బాలికను లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అమ్మాయి నగ్న వీడియోలు చిత్రికరించి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.
రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ నాగేంద్రబాబుతో కలిసి గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. 2020 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్ ప్రదీప్ ప్రస్తుతం ఆర్‌జీఐఏ(రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు) ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు గతంలో పేట్ బషీర్‌బాద్ పీఎస్‌లో పనిచేశాడు. నిందితుడు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్‌లో నివాసముంటూ, ఇంటికి సమీపంలోని చర్చికి వెళ్తున్న క్రమంలో నాలుగేళ్ల క్రితం చర్చిలో ఓ బాలిక పరిచయం అయింది. కొద్ది రోజుల పాటు సాగిన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ప్రేమ, పెళ్లి అని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి బాలికను క్రమంగా లొంగదీసుకున్నాడు.
తనను పెళ్లి చేసుకోవాలని బాలిక కోరగా అందుకు నిందితుడు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఏమైందో ఏమో కానీ, నిందితుడు గతేడాది మరో యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కానిస్టేబుల్‌ను ప్రశ్నించడంతో తన వద్ద ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, విషయం ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం కానిస్టేబుల్ ప్రదీప్‌ని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఉన్నతాధికారులకు ఘటనపై నివేదిక అందజేస్తామని ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.






