12-11-2025 12:17:22 AM
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవులను ఏఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది. డీసీసీ పదవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఒకటి, రెండు రోజుల్లో తీపి కబురు రానుంది. డీసీసీ పీఠాలకు సంబంధించి పార్టీ అధిష్ఠానం తుది కసరత్తు చేసినప్పటికి.. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, ఇతర కారణాలతో ప్రకటన వాయిదా పడుతూ వస్తున్నది.
పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు తీసుకుని 14 నెలలు పూర్తయింది. అయినా పాత కమిటీలతోనే నెట్టుకొస్తున్నారు. ఇక వాయిదా వేయకుండా జిల్లా కాంగ్రెస్ రథసారథులను ప్రకటించాలనే నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చింది. పదవుల పంపకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులతోనూ పార్టీ అధిష్ఠానం పలుమార్లు చర్చించింది.
ఆ తర్వాతనే ఫైనల్ జాబితాను రూపొందించినట్లుగా పార్టీ వర్గా లు చెబుతున్నాయి. అయితే గతంలో జిల్లా కు చెందిన ముఖ్య నాయకులు తమ అనుచరుల కోసం పైరవీలు చేసి.. పదవిని దక్కిం చుకునే వారు. కానీ, పార్టీ అధిష్ఠానం మా త్రం ఆ విధానానికి చెక్ పెట్టింది. ఎవరి ప్ర మేయం లేకుండానే పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకు ఏఐసీసీనే నేరుగా రంగంలోకి దిగి గతంలోఎన్నడు లేని విధంగా పరిశీలకులను నియమించింది.
ఏఐసీసీ పరిశీలకులను తమకు కేటాయించిన జిల్లాలలో పర్యటించి.. క్షేత్ర స్థాయి నుంచి అభిప్రాయలు సేకరించారు. అంతే కాకుండా డీసీసీ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. డీసీసీ పదవుల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువత, మహిళలకు 50 శాతానికి పైగా అవకాశం ఇవ్వాలని నిర్ణయంతో పాటు పార్టీలో దాదాపు ఐదేళ్లుగా పనిచేసి ఉండాలని నిబంధన కూడా పెట్టిన విషయం తెలిసిందే.
వీటితో పాటు ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారికి మళ్లీ అవకాశం ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒకటి, రెండు చోట్ల ఎమ్మెల్యేలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులు అప్పగించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చాలా మంది సీనియర్లు తమ కంటే తమకే పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు.
డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకం..
ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ పరంగా డీసీసీ అధ్యక్షులే కీలకం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు నేరుగా డీసీసీ అధ్యక్షులతో మాట్లాడే అవకాశం ఉంది. అంతే కాకుండా పార్టీపరంగా తీసుకునే నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ పరిస్థితితో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డీసీసీ అధ్యక్షులే బీ ఫామ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఒక్కో జిల్లాలకు పదుల సంఖ్యలో పార్టీ పరిశీలకులకు దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రం తమ, తమ అనుచరుల పేర్లను పరిశీలకులకు చెప్పి.. మద్దతుగా ఉండాలని క్షేత్రస్థాయిలోని పార్టీ నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు వారికి కేటాయించిన జిల్లాలలో సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో సమావేశమై..
జిల్లాల పర్యటన వివరాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరంగా వచ్చిన పీడ్ బ్యాక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షినటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్‌కు వివరించారు. అయితే ఏఐసీసీ పరిశీలకులు ఎవరి పేర్లను పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేశారనేది ఆసక్తిగా మారింది.