12-11-2025 12:38:09 AM
- కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా తవ్వకాలు
- కేబుల్ బ్రిడ్జికి రవాణా చేస్తున్నామంటున్న దందా రాయుళ్లు
- మొద్దు నిద్రలో మైనింగ్ శాఖ
- తమకేమీ తెలియదంటూ దాటవేత సమాధానాలు
ఖమ్మం, నవంబరు 11 (విజయక్రాంతి): ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మట్టి దందా యథేచ్ఛగా జరుగుతోంది. శ్రీనివాస్ నగర్ పరిధిలో పట్టపగలే టిప్పర్ల ద్వారా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మట్టిని కేబుల్ బ్రిడ్జి అవసరాలకు తరలిస్తున్నామంటూ దందారాయళ్లు బహిరంగంగా నే చెబుతుండటం గమనారం! ఇలా నేరుగా మట్టి అక్రమ రవాణా జరుగుతోందంటే.. దీని వెనక కచ్చితంగా పెద్దవాళ్ళు ఉన్నారని, అందుకే అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సామాన్య ప్రజానీకం ఓ గంపెడు మట్టి తవ్వగానే సవాలక్ష నిబంధనలు చెప్పే అధికారులు, ఇలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి అక్రమార్కులకు చెక్ పెట్టాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అనుమతులున్నాయా..?
ప్రభుత్వ లేదా ప్రైవేట్ భూముల్లో మట్టి ఇతర ఖనిజ తవ్వకాల కోసం కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతి లేనిదే తవ్వకాల పనులు చేపట్టకూడదు. కానీ కొంతమంది అక్రమ రాయుళ్లు మాత్రం అధికారులను గుప్పెట్లో పెట్టుకొని అనుమతులు తీసుకోకుండానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఈ నిబంధనలేవీ పాటించకుండానే దాదాపు 20 అడుగుల ఎత్తు ఉండే చిన్నపాటి కొండల నుంచి భారీ ఎక్స్కవేటర్లతో మట్టిని తవ్వుతూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.
ఒక్కో డంపర్ మట్టికి రూ. 6000 వసూలు చేస్తూ వెంచర్లకు, భవన నిర్మాణాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకా కుండా కాల్వ ఒడ్డు ప్రాంతంలో మున్నేరు పై కడుతున్న తీగల వంతెనకు అవసరమైన మట్టిని కూడా ఇక్కడి నుంచే తరలిస్తున్నామని అక్రమార్కులు బహిరంగంగా చెబుతు న్నారు. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకు అక్రమ మార్గాల్లో మట్టిని తరలిస్తున్నారంటే, ఈ తతంగం వెనుక అధికార పార్టీ నాయకుల ‘హస్తం’ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మైనింగ్ శాఖకు పట్టదా..?
తవ్వకాలకు సంబంధించిన ఏ పనిని అయినా మైనింగ్ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నియమ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులకు జరిమానా విధించడం, అక్రమ రాయుళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడం చేస్తుంటారు. జిల్లాకు సంబంధించిన అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రీనివాస నగర్ పరిధిలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల గురించి మైనింగ్ శాఖ అధికారులకు వారం పది రోజుల నుంచి స్థానికులు సమాచారం అందిస్తూనే ఉన్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ‘అది ప్రైవేటు వ్యవహారమని, అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు సంబంధిత యజమానులు చదును చేసుకుంటున్నారు’ అని ఓసారి, ‘ఇదిగో వెళుతున్నాం’ అని మరోసారి దాటవేత సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ మట్టి రవాణా చేసే వారితో, సంబంధిత అధికారులు కలిసి పోవడం వల్లే భారీ స్థాయిలో మట్టి అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ ఖజానాకు గండి..
ఖనిజాల తవ్వకాలకు సంబంధించి వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుంది. అయితే కొంతమంది అధికారులు అక్రమ రాయుళ్లతో చేతులు కలుపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలే అందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులను చూసి చూడనట్లు వ్యవహరిస్తే, ప్రభుత్వానికి అందాల్సిన ఆదాయం తమ జేబుల్లోకి వస్తుందనే ఉద్దేశంతోనే అధికారులు అక్రమార్కులకు ఊతమిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారం పై స్పందించి ఉదాసీనంగా వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారుల పైన, అక్రమార్కుల పైన కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అధికారుల దురుసు సమాధానం..
మట్టి అక్రమ రవాణా పై నిజా నిజాలు తెలుసుకునేందుకు ‘విజయక్రాంతి’ ప్రతినిధి సంబంధిత మైనింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేయగా, అధికారుల నుంచి దురుసు సమాధానం వచ్చింది. తమకు మట్టి రవాణా గురించి సమాచారం అందుతూనే ఉందని, ఇంకా సంబంధిత ప్రాంతానికి వెళ్లి పరిశీలన చేయలేదని సమాధానం చెప్పుకొచ్చారు. ‘అసలు అక్కడ జరుగుతున్న మట్టి రవాణాకి అనుమతులు ఉన్నాయా?’ అని అడగ్గా అది ప్రైవేట్ భూమా? లేక ప్రభుత్వ భూమా? అనుమతులున్నాయా? లేవా? అనేది పరిశీలించాల్సి ఉందని, అయినా మట్టి రవాణా గురించి ఎందుకు ఇలా అడుగుతున్నారంటూ ఎదురు ప్రశ్నించారు.
‘తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లలేదు సరే, అసలు మట్టి తవ్వకాలకు సంబంధించిన నిబంధనలు ఏమిటో తెలియజేయండి’ అని మరోసారి ప్రశ్నించగా, ఇలా ఫోన్లో చెప్పాల్సిన అవసరం తమకు లేదని, ఏదైనా సమాచారం కావాలంటే నేరుగా తమ కార్యాలయానికి రావాలంటూ సమాధానం చెప్పకుండానే సంబంధిత అధికారి ఫోన్ పెట్టేశారు. దీనిని బట్టి అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.