12-11-2025 12:06:56 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ రోజున రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనుషులు, పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మనుషులు నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యం గా మార్చారని, పోలింగ్ తర్వాత “రేపు నీ సంగతి చెప్తామని నవీన్ యాదవ్ మనిషి ఒకరు తననే నేరుగా బెదిరించారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒక రౌడీ షీటర్‌ను ఆంబోతులా బయటకు వదిలేశారు. బోరబండలో మా పార్టీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ అరాచకా లపై ప్రశ్నిస్తే, జైల్లో వేస్తామని పోలీసులే నన్ను బెదిరిస్తున్నారు. నేను ఘటనా స్థలానికి వెళ్లగానే, అక్కడున్న పోలీసులు సమా ధానం చెప్పలేక పారిపోయారు’ అని సునీత ఆరోపించారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘పోలింగ్ కేంద్రాల వద్ద మా బీఆర్‌ఎస్ ఏజెం ట్లు కూర్చుంటే, వాళ్లను కూర్చోనివ్వడం లేదు. వారి దగ్గర ఉన్న టేబుళ్లు, కుర్చీలను పోలీసులు లాక్కెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా?’ అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలింగ్ రోజున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందని సునీత నిలదీశారు. ఈ అక్రమాలపై ఈసీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.