సౌదీ-పాక్-తుర్కియే మధ్య ఒప్పందాలు
- మక్కా వేదికగా మూడు దేశ అధినేతల ‘త్రైపాక్షిక’ సంతకాలు
- ఇక మూడు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా మూడు దేశాలపై దాడి జరిగినట్టే
- ఉమ్మడిగా గగనతల రక్షణ వ్యవస్థల వినియోగానికీ లైన్ క్లియర్
- ఆయుధ తయారీ రంగాల్లో సహాయ సహకారాలకు మార్గం సుగమం
అబుదాబీ, ఆగస్టు ౭: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే మధ్య త్రైపాక్షిక రక్షణ ఒప్పందాలు చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియాలో పవిత్ర నగరమైన మక్కాలో తాజాగా మూడు దేశాల ఒప్పందాలు జరిగాయి.
ఆయా దేశాలు ఈ ఒప్పందాలకు ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ అని నామకరణం చేశాయి. అల్ సఫా ప్యాలెస్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ పాల్గొన్నారు.
ఒప్పందాల్లో ఏముంది?
కొత్త ఒప్పందాల ప్రకారం.. పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియేపై ఏ దేశం సైనిక దాడి చేసినా, ఆ దాడిని మూడింటిపై జరిగిన దాడిగా మూడు దేశాలూ పరిగణిస్తాయి. ఉత్తర అట్లాంటిక్ కోయలిషన్ (నాటో)లోని ఆర్టికల్‌ే 5 నిబంధన తరహాలోనే ఒప్పందం ద్వారా మూడు దేశాల మధ్య ఉమ్మడి సైనిక వ్యూహాలు అమలవుతాయి. మూడు దేశాల మధ్య నిఘా సమాచార మార్పిడి జరుగుతుంది. గగనతల రక్షణ వ్యవస్థలు, అధునాతన ఆయుధ తయారీ రంగాల్లో మూడు దేశాల పరస్పర సహాయ సహకారాలు తీసుకుంటాయి.
తుర్కియే ‘నాటో’ సభ్యత్వం కలిగి ఉన్న దేశం. అత్యంత బలమైన సైనిక శక్తి కలిగిన దేశం. ఆధునిక డ్రోన్లు, రక్షణ పరికరాల తయారీలోనూ తుర్కియే ముందంజలో ఉంది. ఇక పాకిస్థాన్ విషయానికొస్తే.. అణ్వాయుధాలున్న ముస్లిం దేశాల్లో పాకిస్థాన్ ఏకైక దేశం. అలాగే, ఈ దేశం అతిపెద్ద సైనిక బలగాలూ కలిగి ఉన్నది. సౌదీ అరేబియా విషయానికొస్తే.. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు. రక్షణ బడ్జెట్ పరంగా, ఆర్థిక వనరుల పరంగా అత్యంత బలమైన గల్ఫ్ దేశం.
మూడు దేశాల మధ్య తాజా ఒప్పందానికి గల కారణాలను విశ్లేషిస్తే.. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ జరిగిన సైనిక ఘర్షణలు, క్షిపణి దాడులు గల్ఫ్ దేశాల భద్రతా వ్యవస్థల్లోని లోపాలను బయటపెట్టాయి. ఈలోపాలను సవరించుకునే పనిలో ఇప్పుడు సౌదీ, పాకిస్థాన్ పడ్డాయి. మరోవైపు, ఈ త్రైపాక్షిక ఒప్పందాలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. పాకిస్థాన్, తుర్కియే మధ్య సైనిక సంబంధాలు, ఈ అంశంలో సౌదీ అరేబియా పాత్రను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాంతీయ భద్రత, ప్రాంతీయ సమతుల్యత దృష్ట్యా అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపింది.






