నేర నియంత్రణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): నేర నియంత్రణ, కేసుల పరిశోధనలో ఆధునిక టెక్నాలజీ వినియోగించి త్వరితగతిన విచారణ నిర్వహించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని సబ్డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సంబంధిత విభాగాల అధికారులతో మహబూబాబాద్ జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ క్రైమ్ రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ‘మన ఊరు మన బాధ్యత’ కార్యక్రమం అమలుపై ప్రత్యేకంగా ఆరా తీసి, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, యువతలో అవగాహన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం పెంపు వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకొని, నేరాల నియంత్రణలో ముందుండాలని, సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో కేసులకు శిక్షలు సాధించడంలో ప్రతిభ కనబరిచి కృషి చేసిన అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించి, సంబంధిత సీడీఓలకు రివార్డులు అందజేశారు. అనంతరం జిల్లా పోలీస్ వాహనాలపై ప్రత్యేకంగా ఇన్స్పెక్షన్ నిర్వహించగా, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వాహనాల స్థితి, వాహనాలకు సంబంధించిన సమస్యలను నమోదు చేసి ఎంటీఓ ఆర్‌ఐ సోములు పర్యవేక్షించారు. డ్రైవింగ్ చేసేటపుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.






