30-11-2024 07:01:55 PM
మణుగూరు: కుష్టి వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోరంపల్లి బంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు లక్ష్మీ సాహితి సూచించారు. శనివారం స్పర్శ, కుష్టు వ్యాధి నిర్మూలనపైన అవగాహన కార్యక్రమం మోరంపల్లి బంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ లక్ష్మీ సాహితీ వ్యాధి లక్షణాలను వివరించారు. వ్యాధిని త్వరగా గుర్తించడం వల్ల సకాలంలో వైద్యం అందించి కాపాడగలుగుతామని, అందుకోసం ప్రతి ఒక్కరు సామజిక బాధ్యత కలిగి వ్యాధి నిర్మూలన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
కుటుంబంలో లేదా పొరుగు వారిలో లేదా ఈ సమాజంలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా దాని మీద నొప్పి కలిగించినప్పుడు తెలియకపోతే వారిని సమీప ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకొని తగిన చికిత్స తీసుకోవాలన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను కుష్టు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహించాలని వారిని సమీపంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి చికిత్స తీసుకునేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. డిసెంబర్ 2 నుండి 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి, సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు, ఆశాలు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.