10 June, 2026 | 2:04 AM

నన్ను పట్టించుకోరా..!

10-06-2026 12:47 AM
  1. నిర్మించారు.. వినియోగంలోకి తీసుకుని రావడం మరిచారు 
  2. పట్టించుకునే నాథుడు లేక టౌన్ హల్ వెలవెల 
  3. కళావీహనంగా దర్శనమ్మిస్తున్న టౌన్ హాల్
  4. ప్రవేట్ ఫంక్షన్ హాల్ లోనే కొన్ని అధికారిక కార్యక్రమాలు 
  5. టౌన్ హాల్ వినియోగం లోకి తీసుకుని వస్తే మున్సిపాలిటీకి సమాకురనున్న అదనపు ఆదాయం 

వనపర్తి, జూన్ 9 (విజయక్రాంతి): వనపర్తి పట్టణం నడిబొడ్డున పాత వ్యవసాయ మార్కెట్ యార్డు లో గత ప్రభుత్వ హయాంలో ప్రజలందరికి ఉపయోగపడేందుకు ఉద్దేశ్యంతో అప్పటి కౌన్సిల్ సభ్యుల తీర్మానం తో టౌన్ హాల్ నిర్మాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మంత్రులు ప్రారంభించారు. ప్రారంభం అయితే అయ్యింది కానీ ఇప్పటి వరకు వినియోగించుకున్న పాపాన పోలేదు. ప్రజల సొమ్ముతో  టౌన్ హాల్ నిర్మాణమే తప్ప ప్రజలకే అందుబాటులో రాకపోవడంతో కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం ఇప్పుడు కళావిహీనంగా, కార్యకలాపాలు లేక వెలవెలబోతూ నిలిచిపోయింది. నన్ను పట్టించుకోరా&? అన్నట్లుగా టౌన్ హాల్ గోడలే అటు అధికారులకు ఇటు నాయకులను ప్రశ్నిస్తున్నాయి. 

టౌన్ హాల్ ఉద్దేశ్యం..

జిల్లా కేంద్రంలో లలితా కళాతోరణం ఉన్నప్పటికీ సరైన వసతులు లేక కళాకారులు, కవులు, పట్టణ వాసులు ఇబ్బందులు పడేవారు.  పాత మార్కెట్యార్డు స్థలంలో కవులు, కళాకారులు సాంస్కృత్రిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అత్యాధునిక వసతులతో వేదికను సిద్ధం చేయాలని రూ.5.75 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేయగా హాల్లో 800 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొదటి అంతస్తులో 5 గదులతోపాటు హాల్ చుట్టూ వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.

కళావీహనంగా దర్శనమ్మిస్తున్న టౌన్ హాల్ 

వనపర్తి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది కానీ  ఉపయోగ పడాల్సిన టౌన్ హాల్  గోడల మధ్య మాత్రం నిశ్శబ్దం మాత్రమే పెరుగుతోంది,  కళాకారుల ప్రతిభ మెరవాల్సిన వేదిక సభలు,  సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడాల్సిన టౌన్ హాల్ ఎవరు పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం కళావిహీనంగా దర్శనమిస్తున్న సందర్భం నెలకొందని పట్టణంలోని మేధావులు చర్చించుకుంటున్నారు. 

ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ..

టౌన్ హాల్ వినియోగం లోకి రాకపోవడం తో ఇప్పటికి పెద్ద ఎత్తున నిర్వహించే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న సందర్బం అందరికి తెలిసిందే.  టౌన్ హాల్ను సక్రమంగా వినియోగంలోకి తీసుకొస్తే మున్సిపాలిటీకి అదనపు ఆదాయం లభించే అవకాశముంది. వివాహాలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తే అద్దె రూపంలో లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆ ఆదాయం కోల్పోతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.