16 July, 2026 | 12:45 AM

అధికారుల ఆదాయం పెంచుకోవడానికే టౌన్ ప్లానింగ్

16-07-2026 12:00 AM

అధికారుల కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలు

అక్రమ నిర్మాణం అయితే అధికారులకు పండగే

అంతస్థుకు లక్ష చొప్పున వసూళ్లు

కూకట్‌పల్లి, జులై 1౫ (విజయక్రాంతి): కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యాదేచ్చగా పెరిగిపోతున్నాయి. సర్కిల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రభుత్వ ఆధాయానికి భారీగా గండి పడుతుంది. అనుమతి ఒకలా నిర్మాణం మరొకలా నిర్మిస్తున్నప్పటికి వాళ్లకు అందాల్సినవి అందినచో ఆ పక్కకె అధికారులు రావడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులను సంతృప్తిపరిచి అక్రమ నిర్మాణాలను యదేచ్చగా కొనసాగిస్తున్నారు.

దీంతో అక్రమ నిర్మాణాల జోరు కూకట్పల్లిలో ఊపందుకుంది. కే పి హెచ్ బి కాలనీ 4వ ఫేస్ లో ఒక కార్పొరేట్ సంస్థ భారీ అక్రమ షెడ్డు నిర్మాణానికి పూనుకున్నప్పటికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ పక్కకు కూడా తిరిగి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా 800 గజాల స్థలంలో భారీగా నిర్మిస్తున్న అక్రమ షెడ్డు నిర్మాణం పై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టారు.

అధికారులకు ఆమ్యామ్యాలు అందాయో ఏమో కానీ నిర్మాణదారులు తిరిగి షెడ్డు నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. అసలు టౌన్ ప్లానింగ్ విభాగం ఉందా, ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రత్యేకంగా అక్రమ నిర్మాణాలపై విభాగం పని చేస్తున్నప్పటికీ ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా ఆపలేకపోయారంటూ స్థానిక ప్రజలు విమ ర్శిస్తున్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దేవినగర్లో అనుమతిలే లేకుండా ఓ బహుళ అంతస్థుల నిర్మాణాన్ని అక్రమ నిర్మాణదారుడు యదేచ్చగా నిర్మిస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు అందినంత తీసుకొని ఆ భవనం పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సామాన్యుడు చిన్న ఇంటి నిర్మాణాన్ని చేపడితే అక్రమం అంటూ కూల్చివేసే అధికారులకు దేవినగర్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఐదంతస్తుల అక్రమ నిర్మాణం కనబడటం లేదా అని స్థానికులు విమర్శిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణానికి అంతస్తుకు లక్ష చొప్పున నిర్మాణదారుల దగ్గర తీసుకొని ఆ నిర్మాణంపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

కెపిహెచ్బి కాలనీ 9వ ఫేసులో ఓ అక్రమ నిర్మాణదారుడు యదేచ్చగా 6 అంతస్తులు అక్రమ నిర్మాణాన్ని చేపట్టాడు. ఆ నిర్మాణంపై కొందరు ఫిర్యాదులు చేయడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు తూతూ మంత్రంగా సీజ్ చేసి నిర్మాణదారుడికి అనుకూలంగా వివరించారు. మేము రికార్డుల కోసం సీజ్ చేసిన మీరు అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసుకో అనే విధంగా నిర్మాణదారులకు సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అక్రమ నిర్మాణదారుడు సీజును తొలగించి యదేచ్చగా నిర్మాణాన్ని పూర్తిచేసి ఆపై మరో అంతస్తుని నిర్మించాడు.

ఇదే భవనంపై అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని క్రిమినల్ కేస్ నమోదు చేశామని చెప్తున్నారు అయినప్పటికీ నిర్మాణదారుడు నిర్మాణాన్ని పూర్తి చేశాడంటే టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాల బాట వీడి తమ నిజాయితీని నిరూపించుకుంటారంటే అనుమానమే అని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.