టాక్సిక్.. పాత్ బ్రేకింగ్ మూవీ
రాకింగ్ స్టార్ యశ్ నుంచి వస్తున్న తాజాచిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కథానాయకుడు యశ్ మాట్లాడుతూ.. “మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడాలి. మనందరం కలిసి ఇండియన్ సినిమాను గ్లోబల్ సినిమాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలి. ‘కేజీఎఫ్ 2’ సమయంలో దిల్ రాజుతో మాకు పరిచయం ఏర్పడింది. ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. నిజంగా ఆయనకు చాలా మంచి దిల్ ఉంది.
ఆయనతో కలిసి ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్టుకు నేను రెండింతలు తిరిగి ఇస్తాను. ఇంతకంటే అద్భుతమైన సినిమాలు చేస్తాను” అన్నారు. కథానాయకి కియారా అద్వానీ మాట్లాడుతూ.. “మహేశ్‌బాబుతో కలిసి ‘భరత్ అనే నేను’ నా తొలి తెలుగు సినిమా. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం, ప్రేమను మాటల్లో చెప్పలేను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది.
‘టాక్సిక్’ తెలుగు సినిమా మాత్రమే కాదు.. ఇది ఇండియన్ సినిమా” అని తెలిపింది. ‘ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంద’ని మరో హీరోయిన్ హ్యూమా ఖురేషి చెప్పింది. ఇంకో కథానాయకి రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. యశ్‌తో కలసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, అభిమానం లభిస్తుందని ఆశిస్తున్నా” అని తెలిపింది. నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ.. “దిల్ రాజుతో కొలాబరేషన్ ప్రతి సినిమాకీ ఒక బలం తీసుకొస్తుంది.
మా సినిమా ప్రేక్షకులకు రీచ్ కావడానికి దిల్ రాజు ద్వారా మాకు పర్ఫెక్ట్ ఛానల్ దొరికింది. ‘టాక్సిక్’ మిమ్మల్ని ఎంగేజ్ చేయడమే కాదు, ఎక్సైట్ చేయడమే కాదు.. మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది. ఈ సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది” అని చెప్పారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “రామానాయుడు తర్వాత ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్‌గా కేవీఎన్ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా మార్చాలనే యశ్ విజన్‌కు హ్యాట్సాఫ్. ఈ సినిమా విజువల్స్ చూస్తే మతిపోయింది. నిర్మాతలు ఎంత చెబితే అంత ఇచ్చి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి, సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.






