24 August, 2026 | 2:13 AM

జాంబీరెడ్డి.. ఈసారి నెక్స్ లెవెల్!

24-08-2026 12:00 AM

యువ హీరో తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీరెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీరెడ్డి’తో తెలుగు సినిమాకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ఓటీటీ ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ ఎస్ వర్మ.. ఈ చిత్రాన్ని మరింత ఇంటెన్స్‌గా తెరకెక్కించబోతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ‘జాంబీస్ ఆర్ బ్యాక్’, ‘దిస్ టైమ్ నెక్స్ లెవల్’ అనే క్యాప్షన్లతో తాజాగా మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం సమకూర్చనుండగా, అభినందన్ రామానుజం డీవోపీగా, బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 2027లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానుందీ సినిమా.